పుష్ప 2’ సినిమా కోసం పెద్ద ఎత్తున అభిమానులు థియేటర్లకు తరలివెళ్లిన రోజు… ఓ కుటుంబానికి మాత్రం జీవితాంతం మరచిపోలేని దుర్ఘటనగా మారిపోయింది. రెండు తెలుగు రాష్ట్రాలను కలవరపరిచిన ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి బుధవారం నాటికి ఏడాది పూర్తైంది. ఆ రోజు తన అమ్మ, నాన్న, చెల్లితో కలిసి ఎంతో అమాయకంగా, ఆనందంగా సినిమా చూడడానికి వచ్చిన పదేళ్ల శ్రీతేజ్… కేవలం కొన్ని నిమిషాల్లోనే జీవితాన్ని మార్చేసిన విషాదాన్ని ఎదుర్కొన్నాడు.


థియేటర్‌ బయట ఏర్పడిన ఆ రద్దీ, అదుపు తప్పిన తొక్కిసలాట… చిన్నారి శ్రీతేజ్‌ నుంచి అతని తల్లిని దూరం చేసింది. ఆ చిన్నారి కన్నుల ముందే ప్రపంచాన్ని చీకట్లోకి నెట్టేసిన ఆ ప్రమాదం… అతని శరీరానికే కాకుండా, జీవితానికీ ఒక గాఢమైన ముద్ర వేసింది. అదే ప్రాణాంతక ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్‌… తన తల్లి ఇక లేరన్న సంగతి కూడా గుర్తు పట్టలేని స్థితిలో మునిగిపోయాడు. బెడ్‌పై నిశ్చలంగా పడి, కళ్లలో బతికే అశక్తిని చూపిస్తూ… ఏమీ చేయలేని హృదయ విదారక పరిస్థితి.


అసుపత్రి నుంచి డిశ్చార్జి అయినా… ఇల్లు ఇప్పుడు దవాఖానగానే మారిపోయింది. ఘటన జరిగి ఏడాది గడిచినా… ఆ కుటుంబం మాత్రం ఇంకా బాధల లోయలోనే ఉంది. ఆరు నెలల క్రితం డిశ్చార్జ్‌ అయినా, శ్రీతేజ్‌ ఇల్లు ఇప్పుడు పూర్తిగా ఐసీయూనే అయిపోయింది. ఎన్నో పైపులు, ట్యూబులు, మెషీన్స్‌ మధ్య చిన్నారి జీవితం సాగుతోంది. తనంతట తాను అన్నం తినలేడు. అందుకే కడుపులో నేరుగా ఆహారం చేరేందుకు గ్యాస్ట్రోస్టోమీ పైపు అమర్చారు.


సాధారణంగా శ్వాస కూడా తీసుకోలేడు. మెడ ముందుభాగంలో ప్రత్యేకంగా రంధ్రం చేసి, ట్రాకియోస్టోమీ ట్యూబ్ ద్వారా గాలి అందిస్తున్నారు. కేవలం పదేళ్ల వయసు… కానీ శరీరమంతా ట్యూబులు, పరికరాలతో కదలికలేని స్థితిలో మంచంపైనే పడి ఉన్నాడు. గతంలో ఆడుకుంటూ తిరిగిన బాబు… ఇప్పుడు చిన్నపాటి కదలిక కూడా చేయలేని పరిస్థితి. తనకు ఆకలేస్తే కూడా చెప్పలేడు. చేతి వేళ్లతో, కన్నులతో సైగలు చేయాలన్న శక్తి కూడా లేదు.దయనీయ స్థితి చూస్తే ఎవరి మనసైనా ముక్కలవుతుంది..!

మరింత సమాచారం తెలుసుకోండి: