ప్రస్తుతం టాలీవుడ్‌లో ఎక్కువగా వినిపిస్తున్న హాట్ టాపిక్ ఏదైనా ఉందంటే, అది తెలుగు హీరోలు తమ అసలు రూట్‌ను తప్పుతున్నారా అనే ప్రశ్నే. ఒకప్పుడు తెలుగు హీరోలు ఎంచుకునే సినిమాలకు, ఇప్పుడు వారు చేస్తున్న సినిమాలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుందా అంటే… ఎక్కువమంది ప్రేక్షకులు చెప్పే సమాధానం మాత్రం “అవును” అనే ఉంటుంది.పాన్ ఇండియా అనే కాన్సెప్ట్ బయటకు వచ్చిన తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అప్పటి నుంచి ప్రతి హీరో తన సినిమా పాన్ ఇండియా లెవెల్‌లోనే రావాలి అనే ఆలోచనతో ముందుకు వెళ్తున్నారు. అసలు ఆ కథ ఆ స్థాయికి సరిపోతుందా లేదా అనే విషయం పక్కన పెట్టేసి, “ఇది పాన్ ఇండియా మూవీ” అని ముందే ఫిక్స్ అయిపోతున్నారు. ఈ ట్రెండ్ చిన్న హీరోలకే కాదు, పెద్ద స్థాయి స్టార్ హీరోలకూ వర్తిస్తోంది. ఫలితంగా, సరైన కథా బలం లేకుండా భారీ బడ్జెట్, పెద్ద సెట్స్, ఓవర్ డోస్ యాక్షన్‌తో సినిమాలు తెరకెక్కుతున్నాయి.

నిజానికి సినిమా అనేది కేవలం డబ్బులు సంపాదించడానికి మాత్రమే కాదు. ప్రేక్షకులను నిజంగా ఎంటర్టైన్ చేయడానికే సినిమా ఉండాలి. ఒక సినిమా చూసిన తర్వాత అది ప్రేక్షకుల మనసుల్లో చాలా కాలం నిలిచిపోవాలి. థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడు రెండు నుంచి రెండున్నర గంటల పాటు తన జీవితంలో ఉన్న ఒత్తిళ్లు, బాధలు అన్నింటిని మర్చిపోయి నవ్వుతూ, ఆనందంగా సినిమా చూడగలిగితే అదే నిజమైన ఎంటర్టైన్‌మెంట్.

కానీ దురదృష్టవశాత్తు, ఈ మధ్య వస్తున్న చాలా తెలుగు సినిమాలు ఆ దిశగా వెళ్లడం లేదు. ఎక్కువగా కమర్షియల్ ఎలిమెంట్స్ చుట్టూనే కథలు తిరుగుతున్నాయి. కథలో కొత్తదనం లేకుండా, ముందే ఊహించగలిగే సన్నివేశాలతో సినిమాలు తెరకెక్కుతున్నాయి. ముఖ్యంగా పెద్ద హీరోలు ఎంచుకునే కథలు కూడా ఇదే తరహాలో ఉండటంతో అభిమానులు తీవ్రంగా నిరాశ చెందుతున్నారు. కోట్లకు కోట్లు పారితోషికాలు తీసుకుంటున్న హీరోలు తమ ఆస్తులు పెంచుకోవడంలో మాత్రమే ఆసక్తి చూపుతున్నారే తప్ప, అభిమానుల భావోద్వేగాలకు విలువ ఇవ్వడం లేదని కొందరు మండిపడుతున్నారు. హీరోలపై ఉన్న ప్రేమ, నమ్మకం కారణంగానే అభిమానులు థియేటర్‌లకు వస్తున్నారు. కానీ అదే అభిమానులను పదే పదే నిరాశకు గురి చేస్తే, ఆ నమ్మకం క్రమంగా తగ్గిపోతుందనే భయం కూడా వ్యక్తమవుతోంది.

ఇకనైనా సరే,(సోకాల్డ్) స్టార్ తెలుగు హీరోలు పాన్ ఇండియా మోజును పక్కన పెట్టి, నిజంగా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేసే కథలను ఎంచుకుంటే బాగుంటుందని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఇది ఒకరిద్దరు చెప్పే మాట కాదు. ఇండస్ట్రీ మొత్తం మీద ఉన్న పెద్ద పెద్ద హీరోలు దాదాపు అందరూ ఇదే తప్పును చేస్తున్నారు అనే స్థాయికి ఈ చర్చ వెళ్లింది. తెలుగు సినిమా బలం ఎప్పుడూ కథ, భావోద్వేగం, వినోదం. ఆ మూలాలను మరిచి కేవలం మార్కెట్, కలెక్షన్లు, పాన్ ఇండియా ట్యాగ్‌లకే పరిమితమైతే టాలీవుడ్ తన ప్రత్యేకతను కోల్పోయే ప్రమాదం ఉంది. అందుకే ఇప్పటికైనా హీరోలు తమ రూట్‌ను గుర్తించి, ప్రేక్షకుల్ని నిజంగా నవ్వించే, కదిలించే సినిమాలు చేయాలని సినీ ప్రేమికులు కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: