హీరోలు తాము నటించిన చిత్రాలకు ప్రయోషన్‌ కోసం ఎన్నోవింతలు, విచిత్రాలు చేస్తుంటారు. స్టోరీ విషయంలో.. పాత్రలను తీర్చిదిద్దే విషయంలోనే కాదు, తన సినిమాల ప్రమోషన్ల విషయంలోనూ అమీర్ ఖాన్ వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాడు. అందరూ తన సినిమాల గురించి మాట్లాడుకునేలా చేసి, అవలీలగా సూపర్ హిట్ ను అందుకుంటాడు. తాజాగా అమీర్ నటించిన 'తలాష్' మూవీ విడుదలకు రెడీ కావడంతో ప్రమోషన్ విభిన్నంగా ఉండేలా ఆయన ప్లాన్ చేసుకుంటున్నాడు. 'తలాష్' సినిమాలో అమీర్ పోలీస్ ఆఫీసర్ షెకావత్ గా నటించాడు. కథా పరంగా అమీర్ తనకి అప్పగించిన పనిని పూర్తి చేయడానికి రాత్రి 11 గంటల నుంచి ఉదయం 4 గంటల వరకూ సమయాన్ని ఉపయోగించుకుంటాడు. ఆ పాత్ర నైట్ డ్యూటీ చేస్తుంది కాబట్టి ఈ సినిమా షూటింగ్ కూడా ఈ సమయంలోనే జరిగింది. ఇప్పుడు ఈ సినిమా సీన్లకు తగ్గట్టుగానే ప్రమోషన్ ని కూడా రాత్రి సమయంలోనే చేయడానికి అమీర్ ప్లాన్ చేశాడని సమాచారం. మరో వైపు టీవీ సీరియల్లోనూ ఈ సినిమా ప్రమోషన్ ను చేసేందుకు అమీర్ సిద్ధమయ్యాడు. సోనీ టీవీలో వస్తున్న 'సీఐడీ' అనే డిటెక్టివ్ సీరియల్లోని ఓ ఎపిసోడ్ లో అమీర్ ఖాన్ కనిపించనున్నాడు. తన తలాష్ ప్రమోషన్ కోసమే అమీర్ టీవీ సీరియల్ ను కూడా ఉపయోగించుకుంటున్నట్టు తెలుస్తోంది. గతంలో తన '3 ఇడియట్స్' సినిమా కోసం కూడా అమీర్ డిఫరెంట్ గా ప్రమోషన్ నిర్వహించాడు. ఈ సినిమా ప్రచారం కోసం వయసుమీరిన పెద్దమనిషి వేషంలో ఆటోలో ప్రయాణించి వార్తల్లో నిలిచాడు. తన డిఫరెంట్ ప్రమోషన్ లకు తగ్గట్టే ఆయన సినిమాలు కూడా సూపర్ హిట్ అవుతున్నాయి. ఇక తాజాగా అమీర్ విభిన్నంగా ప్రమోషన్ చేస్తున్న 'తలాష్' చిత్రం ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మొత్తానికి క్రియేటివిటీ స్టోరీలతో పాటు ప్రయోగాత్మకంగా ప్రచారం చేసినప్పుడే సినిమా సక్సెస్ అవుతుందని అమీర్ ఖాన్ నిరూపిస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: