డబ్బు సంపాదించడమే పరమావధిగా కొంత మంది నేరస్తులు ఎంతకైనా తెగిస్తున్నారు. కష్టపడితే వచ్చే డబ్బు ఎంత సంతోషాన్ని ఇస్తుందో.. అడ్డగోలిగా సంపాదించే డబ్బు ఎంత కష్టాన్ని తెస్తుందో తెలిసి కూడా అడ్డదారులు పడుతున్నారు కొంత మంది కేటుగాళ్ళు. మనీ లాండరింగ్‌కు పాల్పడిన ఇద్దరు భారత సంతతి వ్యక్తులకు బ్రిటన్ కోర్టు  జైలు శిక్ష విధించింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన విజయ కుమార్ కృష్ణసామి (32), చంద్రశేఖర్ నల్లయాన్(44).. 2.4 మిలియన్ పౌండ్ల(దాదాపు రూ.22.38 కోట్ల) మనీ లాండరింగ్‌కు పాల్పడినట్లు స్కాట్‌లాండ్‌కు చెందిన ఎకనమిక్ క్రైమ్ యూనిట్ కేసు నమోదు చేసింది.

 

నేరపూరిత ఆస్తులను దాచడం, బదిలీ చేయడం వంటి నేరాల కింద కోర్టు విజయ కుమార్ కృష్ణసామికి ఐదేళ్ళ తొమ్మిది నెలలు, చంద్రశేఖర్ నలయన్‌కు 7 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. వీరిద్దరు ఇప్పటికే 2.4 మిలియన్‌ పౌండ్ల మనీలాండరింగ్‌కు పాల్పడటమే కాక మరో 1.6 మిలియన్‌ పౌండ్ల(భారత కరెన్సీలో రూ.14,92,45,120.00) మనీలాండరింగ్‌ ప్రయత్నంలో ఉన్నారని ఎకనామిక్ క్రైమ్ యూనిట్ పోలీసులు తెలిపారు. ఈ నేపథ్యంలో బ్రిటన్ అధికారులు వీరిద్దరినీ అరెస్టు చేసి కోర్టులో హాజరుపర్చారు. ఈ కేసుపై విచారణ జరిపిన కోర్టు.. ఇద్దరినీ దోషులుగా తేల్చింది. అంతేకాకుండా ఇద్దరికీ కలిపి 12 సంవత్సరాల 9 నెలల జైలు శిక్షను విధించింది.

 

ఇందులో చంద్రశేఖర్ నల్లయాన్‌కు ఏడు సంవత్సరాల జైలు శిక్ష పడగా.. విజయ కుమార్ కృష్ణసామికి ఐదు సంవత్సరాల జైలు శిక్షను కోర్టు విధించింది.  ఈ సందర్బంగా డిటెక్టివ్‌ కానిస్టేబుల్‌ మిలేనా బింగ్లీ, మాట్లాడుతూ.. ‘ఇది సంక్లిష్టమైన కేసు. బ్యాంకింగ్ రంగంలోని మా భాగస్వాములు, సైబర్ డిఫెన్స్ అలయన్స్(సీడీఏ) వారి సహకారంతో వీరిని పట్టుకోగలిగాము. అయితే ఇది 2018 నాటి కేసు. దక్షిణ లండన్‌లోని క్రోయిడాన్ క్రౌన్ కోర్టు బార్క్లేస్ బ్యాంక్ అధికారులు మొదటి సారి వీరి మీద ఫిర్యాదు చేశారు’ అని బింగ్లీ తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: