2020 మార్చి నెలలో కేరళకు చెందిన ప్రభు నటరాజన్ తన
భార్య శిల్పా బాలచంద్రన్, కుమారుడు అద్వైత్ తో కలిసి
లండన్ లోని బాన్‌బరీకి షిఫ్ట్ అయ్యారు. వారు అలా
లండన్ లో అడుగు పెట్టారో లేదో వెంటనే అక్కడి ప్రభుత్వం కరోనా తీవ్రత దృష్ట్యా లాక్‌డౌన్ విధించింది. అయితే కరోనా కారణంగా లాక్‌డౌన్‌లు విధించడంతో చాలామంది ఉపాధి లేక నానా ఇక్కట్లు పడ్డారు. ఈ విషయం గుర్తించిన నటరాజన్ తన వంతు సహాయం చేయాలని నడుంకట్టారు. అయితే ఆహారం దొరక్క అవస్థలు పడుతున్న వారికి చాక్లెట్లు, కేకులు ఇతర ఆహార పదార్థాలు ఆయన అందించారు. విశేషమేమిటంటే, ఈయన అందరికీ భిన్నంగా.. సూపర్
హీరో కాస్ట్యూమ్ ధరించి తన సహాయ కార్యక్రమాలు చేపట్టారు. తమను ఆదుకోవడానికి సూపర్ మ్యాన్ రూపంలో నటరాజన్ విచ్చేసారని బాన్‌బరీ ప్రజలు ఎంతో సంతోషంగా ఆహారాన్ని స్వీకరించేవారట.
అయితే ఫుడ్ పంపిణీ చేసే విషయంలో తన కుమారుడితో పాటు తన
భార్య కూడా ఎంతో సహాయం చేసిందని ఆయన చెబుతున్నారు. లాక్‌డౌన్ సమయంలో నటరాజన్ ఎన్నో వందల కుటుంబాలకు ఆహారాన్ని అందజేశారు. అయితే ఒక భారతీయుడు తమ దేశ ప్రజలకు నిస్వార్థంగా ఆహారాన్ని పంచి పెడుతున్నారని గుర్తించిన బోరిస్ జాన్సన్ సర్కార్ నటరాజన్ ను ఒక పురస్కారం తో సత్కరించింది. ఆపత్కాలంలో ప్రశంసనీయ సేవలు అందించినందుకు గాను
ఇంగ్లాండ్ ప్రధాని కార్యాలయం "యూకే పాయింట్స్ ఆఫ్ లైట్" అవార్డుతో ప్రభు
నటరాజ్ ను సత్కరించింది.
నటరాజన్ శాంతా క్లాస్,
ఈస్టర్ బన్నీ కాస్ట్యూమ్స్ కూడా ధరించి వందలాది కుటుంబాలకు ఆహార పదార్థాలు పంచిపెట్టారు. ఆయన ఇప్పటికే 11 వేల చాక్లెట్లు పంపిణీ చేశారు. అలాగే ఫుడ్ బ్యాంకు స్థాపించి విరాళాలు సేకరిస్తూ అందరికీ ఆహారం అందేలా చర్యలు చేపడుతున్నారు. తన
తండ్రి తో పాటు 11 మంది కుటుంబ సభ్యులు 22 మంది స్నేహితులు కరోనాతో చనిపోయారని ఆయన ఈ సందర్భంగా వెల్లడించారు.