ప్రసిద్ధి గాంచిన మసాచుసెట్స్ ఇన్‌స్టిట్యూట్‌ లో పని చేస్తున్న అరుప్ కె. చక్రవర్తి అనే ఓ ఇండియన్ అమెరికన్ కెమికల్ ఇంజనీర్ కి అత్యున్నత గౌరవం దక్కింది. మసాచుసెట్స్ విశ్వవిద్యాలయం ఆయనకు "ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్స్" అనే టైటిల్ ప్రధానం చేశారు. ఈ టైటిల్ ఎమ్ఐటీ ఫ్యాకల్టీ సభ్యులకు ఇచ్చే అత్యున్నత గౌరవం. భారత సంతతికి చెందిన అరుప్ కె. చక్రవర్తి ఎమ్ఐటీ ఇన్‌స్టిట్యూట్‌ యొక్క మెడికల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ (IMES) విభాగానికి వ్యవస్థాపక డైరెక్టర్ గా పని చేస్తున్నారు. వ్యాక్సిన్ అభివృద్ధి, రోగనిరోధక శాస్త్ర రంగంలో ఎదురయ్యే సవాళ్లకు కంప్యూటర్, గణన పద్ధతులను ఉపయోగించవచ్చని అరుప్ కె. చక్రవర్తి కనుగొన్నారు.

అయితే ఆయనను అరుదైన గౌరవంతో సత్కరించిన అనంతరం ఎమ్ఐటీ ప్రెసిడెంట్ ఎల్. రాఫెల్ రీఫ్ మాట్లాడుతూ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్ అయిన అరుప్ చక్రవర్తిని మహోన్నతమైన శాస్త్రవేత్త అని ప్రశంసల జల్లు కురిపించారు. మెడికల్ ఇంజనీరింగ్ అండ్ సైన్స్ విభాగానికి విజనరీ ఫౌండింగ్ డైరెక్టర్ గా పేరుగాంచిన అరుప్ చక్రవర్తి.. హెచ్ఐవి వ్యాక్సిన్ అభివృద్ధి విషయంలోనూ సహాయం చేశారని.. ఆయన ఆలోచనలు టీకా అభివృద్ధికి ఎంతగానో ఉపయోగపడ్డాయని ఎల్. రాఫెల్ రీఫ్ వెల్లడించారు. అత్యంత సంక్లిష్టమైన సమస్యలను ఖచ్చితత్వం, స్పష్టతలతో వివరించగల అద్భుతమైన ప్రతిభ అరుప్ కి ఉందని ఆయన అన్నారు. ఎమ్ఐటీ ఇన్‌స్టిట్యూట్‌, కమ్యూనిటీలకు అరుప్ గొప్ప రాయబారులని ఆయన అన్నారు.

ఇకపోతే పౌలా హమ్మండ్ కూడా "ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్స్" టైటిల్ గెలిచారు. దీంతో ఎమ్ఐటీ విశ్వవిద్యాలయంలో ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్స్ సంఖ్య 12 కు చేరుకుంది. జులై 1వ తేదీ నుంచి హమ్మండ్, అరుప్ ఇన్‌స్టిట్యూట్‌ ప్రొఫెసర్స్ గా ఎమ్ఐటీ విశ్వవిద్యాలయంలో కొనసాగనున్నారు. అరుప్ రోగనిరోధక శాస్త్రానికి సంబంధించి అనేక ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తూ స్టాటిష్టికల్ ఫిజిక్స్ లోని ప్రాథమిక విధానాలపై దృష్టి సారించారు. అలాగే ఆయన వ్యాక్సిన్ అభివృద్ధి పై చేసిన పరిశోధనలు హెచ్ఐవి టీకా అభివృద్ధికి బాటలు వేశాయి. ప్రస్తుతం ఈ హెచ్ఐవి టీకా ప్రీక్లినికల్ ట్రయిల్స్ లో ఉందని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: