లోక్ సభ ఎన్నికల్లో తమ పార్టీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని ఆకర్షణగా నిలుస్తూ తమకు అధికార పీఠం దక్కటంలో కీలకపాత్ర వహించగలడని భారతీయ జనతా పార్టీ పెంచుకుంటున్న ఆశలను గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీ నిజం చేయగలరా అనే అనుమానాలు కర్నాట ఎన్నికల ఫలితాలు తర్వాత వ్యక్తమవుతున్నాయి.  రాజ్ నాథ్ సింగ్  పార్టీ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టిన తరువాత జరిగిన మొట్టమొదటి విధానసభ ఎన్నికలో ఒటమి చవిచూశారు. దీంతో రానున్న పార్లమెంటు ఎన్నికల్లో పార్టీని విజయపథంలో నడిపించగలరా అనేది ప్రశ్నార్ధమైంది.

దక్షిణ భారత దేశంలో తమ సొంత బలం పై కర్నాటకలో నిర్మించుకున్న అధికార పీఠం కుప్పకూలిపోవటంతో బిజెపిలో ఇప్పుడు అంతర్మథనం మొదలైంది. నిజానికి కర్నాటకలో గత ఐదేళ్ల పాలనలో చోటు చేసుకున్న వివిధ పరిణామాలు తమ విజయం పై విపరీతమైన ప్రభావం చూపించే అవకాశాలు ఉన్నాయన్న భయం బిజెపి నాయకత్వాన్న ఎప్పటినుంచో వెంటాడింది. అయితే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎదుర్కుంటున్న అవినీతి ఆరోపణలు, రాష్ట్ర కాంగ్రెస్ లో ఉన్న అభిప్రాయ భేదాలు, నాయకత్వ లోపం తమకు కొంత వరకూ కలిసి రావచ్చునని బిజెపి భావించింది.

కాగా గుజరాత్ లో హ్యాట్రిక్ సాధించిన ముఖ్యమంత్రి నరేంద్రమోడీని ప్రచారంలోకి దించి తమ అదృష్టాన్ని పరీక్షించుకుంది. గుజరాత్ సాధించిన అభివృద్ధి నమూనాను మోడీ కన్నడ ప్రజల ముందుంచి ఆకట్టుకుంటారని పార్టీ ఆదేశించింది. అనుకున్నట్లుగానే బెంగుళూరు పరిసర ప్రాంతాల్లో మోడీ సభలకు అధిక సంఖ్యలో ప్రజలు తరలిరావటంతో ఆయన పర్యటనను రెండురోజులు పొడిగించి మరికొన్ని ప్రాంతాలకు పంపారు. కాగా మోడీ ప్రచారం చేసిన చోట పార్టీ పరాజయం పాలైంది. బెంగుళూర్ తో సహా బెల్గాంలో పార్టీ ఓడింది. ముస్లీం ఓట్లు అధిక సంఖ్యలో జనతాదళ్ కు పడ్డాయని పార్టీ వర్గాలు భావిస్తున్నాయి.

అసలు దక్షిణ భారత దేశంలో పార్టీకి నాయకత్వం లేదన్నది జగద్విదితం. గతంలో కార్యకర్తల పార్టీగా గుర్తింపు పొందిన బీజెపికి ఇప్పుడు కార్యకర్తలు ఆమడ దూరంలో ఉంటున్నారు. ఈ క్రమంలో పార్టీ నిర్మాణం, ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించటం కంటే నాయకులు ఏసీ గదులకే పరిమితం అవుతున్నందువలనే ఈ పరిస్థితి దాపురించిందని ఆర్ఎస్ఎస్ గతంలో చేసిన హెచ్చరికను ఒక వర్గం సమర్థిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: