టెక్సాస్, హ్యూస్టన్ లలో హార్వే తుపాను బీభత్సాన్ని మరువక ముందే ఇర్మా హరికేన్ అమెరికాను వణికిస్తోంది. ఇప్పటికే కరీబియన్ దీవులను వణికించిన ఇర్మా.. ఇప్పుడు ఫ్లోరిడాకు సమీపంలో ఉంది. ఏ క్షణంలో అయినా ఇది తీరం దాటనుంది. హార్వేను మించిన వేగంతో ఇర్మా దూసుకొస్తుండడంతో ఫ్లోరిడాకు నిద్ర కరువైంది.


          హరికేన్ హార్వే నుంచి అమెరికా బయటపడకముందే ఇర్మా విరుచుకుపడింది. హార్వే గంటకు 295 కిలోమీటర్ల వేగంతో వ్యాపించగా.. ఇర్మా అంతకుమించిన వేగంతో ప్రళయరూపంతో దూసుకొస్తోంది. ఇర్మా వేగం 320 కిలోమీటర్లకు పైగా ఉండనుందని వాతావరణ అధికారులు హెచ్చరించారు. అట్లాంటిక్ సముద్రంలో ఇదే అతిపెద్ద హరికేన్ అని వారు చెప్తున్నారు.


ఇర్మా తుపాను వల్ల పలు రాష్ట్రాల్లో అత్యవసర స్థితి ప్రకటించింది ప్రభుత్వం. బెర్ముడా తీరాన్ని తాకిన తర్వాత ఇది కరీబియన్ దీవుల్లో బీభత్సం మిగిల్చింది. ఈ దీవుల్లో 90 శాతం ఇళ్లు నేలమట్టమైనట్టు తెలుస్తోంది. ప్రాణనష్టంపై ఇంతవరకూ కచ్చితమైన సమచారం లేదు. ప్యూర్టోరికో, వర్జీనియా ఐలాండ్స్ లో కూడా ఇర్మా తీవ్ర ప్రభావం చూపించింది. విద్యుత్ నిలిచిపోవడం, సమాచార వ్యవస్థకు విఘాతం కలగడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.


          హార్వే హరికేన్ కంటే ఇర్మా వల్ల కలిగే నష్టం చాలా ఎక్కువగా ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అందుకే వీలైనంత మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేస్తున్నారు. విలువైన డాక్యుమెంట్లను భద్రపరుచుకోవాలని సూచించారు. హార్వే వల్ల మూడున్నర లక్షల కోట్ల నష్టం వాటిల్లగా ఇర్మా వల్ల 9 కోట్ల వరకూ నష్టం జరిగే ప్రమాదముందని అంచనా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: