నిర్భయ అత్యాచార, హత్య కేసులో నిందితునిగా ఉన్న ముకేష్ సింగ్ న్యాయస్థానం ముందు తనపై లైంగిక దాడి జరిగిందని సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ క్షమాభిక్ష పిటిషన్ ను తిరస్కరించడంతో ముకేష్ సింగ్ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. ఈరోజు ఈ పిటిషన్ విచారణకు వచ్చింది. సుప్రీం ప్రధాన న్యాయమూర్తి ఎస్.ఏ. బాబ్డే నేతృత్వంలోని ముగ్గురు సభ్యుల ధర్మాసనం ఈరోజు పిటిషన్ ను విచారణ జరిపింది. 
 
న్యాయస్థానం ముందు విచారణ సందర్భంగా ముఖేష్ సింగ్ సంచలన విషయాలను వెల్లడించాడు. తనపై తీహార్ జైలులో లైంగిక దాడి జరిగిందని సహదోషి అక్షయ్ సింగ్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని పలుమార్లు ఇలా జరిగిందని ముఖేష్ సింగ్ చెప్పాడు. ఇందులో తీహార్ జైలు అధికారుల సహకారం కూడా ఉందంటూ ముఖేష్ సింగ్ సంచలన ఆరోపణలు చేశారు. 
 
రాష్ట్రపతికి పెట్టిన క్షమాభిక్ష పిటిషన్ లోనే తాను ఈ విషయాలను వెల్లడించానని ముఖేష్ సింగ్ పేర్కొన్నారు. ముకేష్ తరపు న్యాయవాది ప్రకాష్ కూడా తన వాదనలను వినిపించారు. న్యాయస్థానం క్షమాభిక్ష పిటిషన్ పై తీర్పును రిజర్వ్ లో పెట్టగా రేపు తుది తీర్పును వెల్లడించనుంది. న్యాయస్థానం గతంలోనే ఫిబ్రవరి 1వ తేదీ ఉదయం 6 గంటలకు నలుగురు దోషులను ఉరి తీయాలని డెత్ వారెంట్లను జారీ చేసింది. 
 
ఇప్పటికే నిర్భయ కేసు దోషులు ఉరిశిక్ష నుండి తప్పించుకోవటం కొరకు అనేక ప్రయత్నాలు చేయగా ఆ ప్రయత్నాలేవీ ఫలించలేదు. సుప్రీం తీర్పుపై రివ్యూ పిటిషన్ దాఖలు చేయగా ఆ పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. రాష్ట్రపతికి ముఖేష్ సింగ్ క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకోగా ఆ పిటిషన్ ను కూడా రాష్ట్రపతి తిరస్కరించారు. నిర్భయ తల్లిదండ్రులు మాత్రం ఉరిశిక్ష నుండి తప్పించుకోవాలనే ఉద్దేశంతో దోషులు నాటకాలు ఆడుతున్నారని అన్నారు.  రేపు కోర్టు ఎలాంటి తీర్పు చెబుతుందో చూడాల్సి ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: