జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దయి ఏడాది దాటిపోయింది. అయినా అక్కడ పరిస్థితుల్లో పెద్దగా మార్పులేదని స్థానికులు, విశ్లేషకులు విమర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాయుధ బలగాలను భారీగా వెనక్కు రప్పించాలని నిర్ణయించింది.

ఆర్టికల్ 370 రద్దు నేపథ్యంలో జమ్మూకాశ్మీర్‌లో భారీగా సాయుధ బలగాలను మోహరించింది కేంద్ర ప్రభుత్వం. ప్రత్యేక ప్రతిపత్తిని రద్దు చేస్తుండడంతో అల్లర్లు చెలరేగే ప్రమాదం ఉందని భావించిన కేంద్రం.. ఈ నిర్ణయం తీసుకుంది. అయితే ఏడాది దాటిన తర్వాత కూడా ఇప్పటికీ సాయుధ బలగాల నీడలోనే జమ్మూకాశ్మీర్‌ ఉందంటూ పలువురు విమర్శిస్తున్నారు. ఆర్టికల్ 370 రద్దు ద్వారా జమ్మూ కాశ్మీర్‌కు స్వేచ్ఛా వాయువులు పీల్చుకునే అవకాశం కల్పించామని కేంద్రం చెబుతోంది. అయితే అది కేవలం పేపర్లకే పరిమితమైందని.. క్షేత్రస్థాయిలో అలాంటి పరిస్థితి లేదని స్థానికులే చెబుతున్నారు. కాశ్మీరీ పండిట్లు కూడా పెదవి విరుస్తున్న పరిస్థితి.

అయితే ఈ ఏడాది కాలంలో ఉగ్రమూకల దాడులు తగ్గుముఖం పట్టాయి. అధికారం కేంద్రం చేతిలోకి రావడంతో అల్లరిమూకలను ఏరివేసింది. దీంతో వేర్పాటువాదులు నోరెత్తే పరిస్థితి లేకుండా పోయింది. ఆర్టికల్‌ రద్దు నేపథ్యంలో పలువురు రాజకీయ నేతలను దిగ్బంధించింది కేంద్రం.  దీనిపై విమర్శలు వెల్లువెత్తడంతో కొంతమందిని విడుదల చేసింది. ఇప్పటికీ పలువురు నేతలు నిర్బంధంలోనే ఉన్నారు.

గతంతో పోల్చితే జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితులు చాలావరకూ మెరుగుపడ్డాయని కేంద్రం భావిస్తోంది. అందుకే 10వేల మంది పారామిలిటరీ సిబ్బందిని వెనక్కు రప్పించాలని నిర్ణయించింది. ఈ మేరకు ఉత్తర్వులు కూడా జారీ చేసింది. కాశ్మీర్‌ లోయలో సాధారణ పరిస్థితులు నెలకొల్పడంలో భాగంగానే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని భావిస్తున్నారు.

మొత్తానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జమ్మూకాశ్మీర్ కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370 రద్దయి సంవత్సరం అయిపోయింది. ఈ మధ్యకాలంలో అక్కడ పెద్ద మార్పులేమీ చోటు చేసుకోలేదు. ఇంకేముందీ సైన్యం అవసరం కూడా లేదు. అందుకే సైన్యాన్ని వెనక్కి పిలిపించింది కేంద్ర ప్రభుత్వం.


మరింత సమాచారం తెలుసుకోండి: