టెక్నాలజీని వాడుకోవడం అంటే అది కేవలం మోడీకి తెలిసిన విద్య కాదు.. ఆ విషయంలో తాము కూడా భారతీయ జనతా పార్టీకి పోటీ ఇవ్వగలమని అంటున్నారు కాంగ్రెస్ నేతలు. ఈ మేరకు వారు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొంటూ ముందుకు సాగుతూ భారతీయ జనతా పార్టీకి కొత్త సవాలు విసురుతున్నారు. పార్టీ మెంబర్ షిప్ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ కొత్త రూటు ను ఎంచుకొంది. ఏకంగా ఒక స్మార్ట్ ఫోన్ అప్లికేషన్ మొదలుపెట్టింది.

భారతీయ జనతా పార్టీ వాళ్లు మెంబర్ షిప్ డ్రైవ్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకొని మెసేజ్ సర్వీసుల ద్వారా, ఇమెయిళ్ల ద్వారా పార్టీ సభ్యులను జాయిన్ చేసుకొన్నారు. ఏకంగా ప్రపంచ రికార్డునే తిరగరాశామని కూడా వారు ప్రకటించుకొన్నారు. భారతీయ జనతా పార్టీ ఇప్పటికే చైనా కమ్యూనిస్టు పార్టీ ని దాటేసిందని.. సభ్యత్వాల సంఖ్య విషయంలో ప్రపంచ రికార్డును సృష్టించిందని.. ఏకంగా పది కోట్ల సభ్యత్వాలతో సరికొత్త ప్రపంచ రికార్డును సృష్టించబోతున్నామని కమలనాథులు ప్రకటించుకొన్నారు.

ఈనేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ కూడా సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని హోరెత్తిస్తానని అంటోంది. దీని కోసం ఒక అప్లికేషన్ ను కూడా ప్రారంభించింది. ఆ యాప్ ద్వారా పార్టీ సభ్యత్వాన్ని తీసుకోవచ్చని ప్రకటించింది. ఈ విధంగా సభ్యత్వ నమోదు కార్యక్రమానికి అప్లికేషన్ టచ్ ఇచ్చింది. ట్విటర్ , ఫేస్ బుక్ వంటి అకౌంట్ల ద్వారా చేరువ అవుతున్న భారతీయ జనతా పార్టీ వారికి ధీటుగా కాంగ్రెస్ వాళ్లు ఇలా అప్లికేషన్ దారిలో నడుస్తున్నారు.

మరి సభ్యత్వ నమోదు పెంచుకోవాలంటే కేవలం అప్లికేషన్ చాలదు. దానికి చాలా కష్టం పడాలి. అధికారంలో ఉంది కాబట్టి అలా కష్టపడే ఓపిక కమలనాథులకు ఉంటుంది. మరి కాంగ్రెస్ నేతలకు అలాంటి తీరిక ఉందా?!


మరింత సమాచారం తెలుసుకోండి: