వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచాలని, అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే గొంతు వినిపించాలంటూ ఏపీ సీఎం జగన్ వారికి లేఖలు రాసిన సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఇదే అభిప్రాయంతో ఉన్నారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నేరుగా కేంద్రంపై యుద్ధానికి సిద్ధమయ్యారు. ఇటీవల జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ కూడా కేంద్రమే వ్యాక్సినేషన్ల బాధ్యత స్వీకరించాలని, లేదా ఆర్థిక సాయం చేయాలన కరాఖండిగా చెప్పారు. ఈ దశలో ఏపీ సీఎం జగన్ రాసిన లేఖ కలకలం రేపుతోంది. అయితే జగన్ తో కలిసొచ్చేదెవరు, ఆయన్ను విభేదించేది ఎవరు అనే విషయం తేలాల్సి ఉంది.

తెలంగాణ గడ్డపైనే వ్యాక్సిన్ తయారయిందని సంతోష పడ్డ కేసీఆర్ ని కూడా వ్యాక్సిన్ కొరత ఇబ్బంది పెట్టింది. ఓవైపు ప్రజలనుంచి ఒత్తిడి పెరగడం, మరోవైపు వ్యాక్సిన్ నిల్వలు లేకపోవడంతో దాదాపుగా అన్ని రాష్ట్రాలు ఇబ్బంది పడ్డాయి. అయితే తెలంగాణ సీఎం కేసీఆర్ మాత్రం వ్యాక్సిన్ విషయంలో కేంద్రాన్ని టార్గెట్ చేయలేదు. చేస్తారని కూడా అనుకోడానికి లేదు. ఎందుకంటే ఇటీవల జరిగిన, జరుగుతున్న కొన్ని కీలక పరిణామాలు కేంద్రంతో కేసీఆర్ దోస్తీని చెప్పకనే చెబుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఏదో మొహమాటానికి విమర్శలు చేస్తున్నట్టు ఉన్నా.. కేంద్రం మాత్రం, కేసీఆర్ తో కాస్త సానుకూలంగానే ఉంది. ఆయుష్మాన్ భారత్ ని తెలంగాణలో అందుబాటులోకి తెచ్చి కేంద్రాన్ని సంతృప్తి పరిచారు కేసీఆర్. కొవిడ్ నివారణ చర్యల విషయంలో తెలంగాణ సర్కారు నిర్ణయాలను పలుమార్లు కేంద్రం మెచ్చుకుంది కూడా. ఈ దశలో కేంద్రంతో కయ్యం అంటే కేసీఆర్ కి ఇష్టం ఉండకపోవచ్చు. ఇటీవల ఈటల రాజేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా ఈ అనుమానాన్ని బలపరుస్తున్నాయి. భవిష్యత్తులో బీజేపీ, టీఆర్ఎస్ పొత్తు పెట్టుకుంటే, మా లాంటి వారి పరిస్థితి ఏంటని, పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్న ఈటల బీజేపీ అగ్రనాయకత్వం వద్ద అనుమానం వ్యక్తం చేశారు. అలాంటిదేమీ ఉండదని జేపీ నడ్డా స్పష్టం చేశాడని వార్తలొచ్చినా.. బీజేపీ, టీఆర్ఎస్ సఖ్యత చూస్తుంటే మోదీని కేసీఆర్ బలపరుస్తున్నట్టు తెలుస్తోంది. ఈ దశలో ఏపీ సీఎం జగన్ చేసిన ప్రతిపాదనకు కేసీఆర్ సానుకూలంగా స్పందించే అవకాశం లేదనే చెప్పాలి. వ్యాక్సినేషన్ విషయంలో కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు కేసీఆర్, జగన్ తో కలసినడిచే అవకాశం లేదని రాజకీయ విశ్లేషకులంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: