హుజురాబాద్ ఉప ఎన్నికల పోరు ఊపందుకుంది. బుధవారం వరకు మొత్తం 9 నామినేషన్లు దాఖలు చేయగా గురువారం పెద్దఎత్తున నామినేషన్లు వేయడానికి అభ్యర్థులు పోటెత్తారు. ఈ నెల 8న కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్ వేయనున్నారు. ఈ నెల 8 వరకు నామినేషన్ల స్వీకరణ తుది గడువు కాగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగుతుంది. హుజురాబాద్ లో ఇప్పటికే టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ యాదవ్  నామినేషన్ దాఖలు చేశారు. మరోవైపు బిజెపి అభ్యర్థిగా ఈటల రాజేందర్ బరిలోకి దిగుతారు. కాంగ్రెస్ నుంచి బల్మూరి వెంకట్ ని బరిలోకి దించారు. ఇదిలా ఉంటే బిజెపి డమ్మీ అభ్యర్థి గా ఈటెల రాజేందర్ సతీమణి జమున పేరిట ఆ పార్టీ కార్యకర్తలు నామినేషన్ దాఖలు చేశారు.

స్వతంత్ర అభ్యర్థులుగా కొందరు నామినేషన్లు  దాఖలు చేశారు. మరోవైపు హుజురాబాద్ ఉప ఎన్నికల బరిలో మేముసైతం అంటూ ముందుకు వస్తున్నారు ఫీల్డ్ అసిస్టెంట్లు. హుజురాబాద్ ఉప ఎన్నిక అక్టోబర్ 30 న జరగనుంది. ఈ నేపథ్యంలో అన్ని పార్టీలు ప్రజల్లోకి వెళుతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో అధికార పార్టీ ప్రతినిధులు, ప్రతిపక్ష పార్టీ ప్రతినిధుల మధ్య పోటీ జరుగుతుంది. టిఆర్ఎస్ బిజెపిలు ప్రచారంలో దూసుకుపోతున్నాయి. ఇక్కడున్న సమస్య ఒక్కటే బిజెపి అభ్యర్థి ఈటల రాజేందర్ ఏ మీటింగ్ పెట్టిన వందలాది జనాలు వస్తున్నారు. అధికార పార్టీ నాయకులు ఏ సభ పెట్టిన జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. వందలాది ప్రజలు వస్తున్న ఓటరు నాడి మాత్రం ఎవరికీ అంతుచిక్కడం లేదు. అధికార పార్టీ నయానో భయానో బెదిరిస్తూ ప్రతిపక్ష నేతలను తమ పార్టీలోకి తీసుకు వెళుతూ ఈటల రాజేందర్ ను ఒంటరి చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అధికార పార్టీ నుండి కూడా ప్రతిపక్ష పార్టీ లోకి చిన్న పెద్ద తేడా లేకుండా నాయకులు వలసలు పోతున్నారు. అయితే వలసలు ఇంకా ఎన్ని రోజులు కొనసాగుతాయో కూడా ఇప్పటివరకు అర్థం కాలేదు. అధికార పార్టీ తాను చేస్తున్న అభివృద్ధి పనులను  నియోజకవర్గ ప్రజలకు వివరిస్తూ హుజురాబాద్ నియోజకవర్గానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ అభివృద్ధి పనులు ప్రారంభించారు. వీటిలో అన్ని కుల సంఘాలకు స్థలాలు, భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తున్నారు. నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి సిసి రోడ్లు, మురికి కాలువల కోసం ప్రజలు అడిగిందే తడవుగా అధికారపార్టీ నిధులు మంజూరు చేస్తూ టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని చెప్తున్నారు.

ఈటల రాజేందర్ ప్రభుత్వ పథకాలను ఉద్దేశిస్తూ నిధులన్నీ నేను మంత్రిగా ఉన్నప్పుడు పెట్టిన నిధులని అప్పుడు తొక్కిపెట్టి ఇప్పుడు నిధులు మంజూరు చేసి ఏదో ఘనకార్యం చేస్తున్నాం అని అధికార పార్టీ నాయకులు చెప్పుకోవడం సిగ్గుచేటుగా ఉందని ఆయన అన్నారు. ఈ పరిణామాలతో ప్రస్తుత ఈ పరిస్థితుల్లో గెల్లు శ్రీనివాస్ గెలుస్తారా, ఈటెల రాజేందర్ గెలుస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది . ఇప్పటివరకు నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి ఇంకా ప్రచారం  ప్రారంభించలేదు. కాంగ్రెస్ పార్టీ కాలయాపన చేయడం ఎవరికీ కలిసి వస్తుందో అనే విషయం  ఇప్పుడు కీలకంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: