పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరుగుతున్న సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులు కేంద్ర హోమ్ శాఖ మంత్రి అమిత్ షా‌తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలు అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలపై కూడా అమిత్ షా దగ్గర వైసీపీ ఎంపీలు ప్రస్తావించినట్లు తెలుస్తోంది. వైసీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు విజయ సాయి రెడ్డి, లోక్ సభా పక్ష నేత మిథున్ రెడ్డి పార్లమెంట్‌ ఆవరణలోని కేంద్ర హోం శాఖ కార్యాలయంలో అమిత్ షా‌తో సమావేశమయ్యారు. రాష్ట్రానికి సంబంధించిన అనేక సమస్యలను అమిత్ షాకు వివరించారు. అలాగే రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన సాయంపై కూడా వినతి పత్రం అందించారు. రాష్ట్రం విడిపోయి దాదాపు ఎనిమిదేళ్లు కావస్తున్నా కూడా... ఇప్పటికే విభజన హామీలు అమలు కాలేదని విజయ సాయి రెడ్డి వెల్లడించారు.

రాష్ట్రానికి చెందిన సమస్యలపై అమిత్ షాకు మెమోరాండం అందించారు వైసీపీ ఎంపీలు. పోలవరం ప్రాజెక్టును కేంద్రం ఇప్పటికే జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు ప్రాజెక్టు నిర్మాణం కోసం సవరించిన అంచనా వ్యయానికి కేంద్ర ఆర్థిక శాఖ ఆమోదం తెలిపేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. నిధుల కొరత కారణంగా ప్రాజెక్టు నిర్మాణం ఆలస్యం అవుతోందని వెల్లడించారు. ప్రాజెక్టు నిర్మాణం పూర్తి చేసేందుకు కేంద్రం సహకారం అందించేలా చూడాలని ఎంపీలు లేఖ అందించారు. ఇక రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలపై కూడా లేఖలో ప్రస్తావించారు. రాష్ట్రంలో వరదల వల్ల ఇప్పటికే దాదాపు 7 వేల కోట్ల రూపాయల వరకు నష్టం జరిగిందన్నారు. పంట నష్టమే మూడున్నర వేల కోట్ల వరకు ఉంటుందన్నారు. కేంద్ర ప్రతినిధుల బృందం పర్యటించిన విషయాన్ని గుర్తు చేసిన ఎంపీలు... కేంద్రం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సాయం అందలేదని వెల్లడించారు. తక్షణ సాయం కింద వెయ్యి కోట్ల రూపాయలు విడుదల చేయాలని కూడా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి లేఖ రాశారని... అయినా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన రాలేదన్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: