ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంపై కేంద్రం ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది. అధికారంలోకి వచ్చిన వెంటనే... కేంద్రం మెడలు వంచి అయినా సరే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఏపీ ప్రజలకు హామీ ఇచ్చారు. 2019 సార్వత్రిక ఎన్నికల్లో ఏకంగా 22 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. దీంతో రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఖాయమని అంతా భావించారు. అయితే అది అంత సులువు కాదని... తొలి ఢిల్లీ పర్యటనలోనే జగన్ తేల్చి చెప్పారు. అయితే రెండున్నర ఏళ్లుగా ఎప్పుడు పార్లమెంట్ సమావేశాలు జరిగిన సరే... రాష్ట్రానికి ప్రత్యేక హోదా అంశం మాత్రం తప్పని సరిగా పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రస్తావనకు వస్తుంది. అటు అధికార వైసీపీ ఎంపీలు కానీ... ఇటు ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ... ఈ విషయాన్ని తప్పని సరిగా ప్రస్తావిస్తూనే ఉన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్న పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో కూడా మరోసారి ప్రత్యేక హోదా అంశం ప్రస్తావించారు వైసీపీ ఎంపీ విజయ సాయి రెడ్డి.

రాజ్యసభలో ఎంపీ విజయ సాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. గతంలోనే హోదాకు బదులుగా ప్యాకేజీకి రాష్ట్ర ప్రభుత్వం అంగీకరించిన విషయాన్ని గుర్తు చేశారు. ప్యాకేజీ కింద ఏపీ ప్రభుత్వం నిధులు తీసుకుందని మంత్రి పంకజ్ చౌదరి వెల్లడించారు. అదే సమయంలో విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలు విషయంలో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యంతరం లేదని కూడా కేంద్ర మంత్రి పంకజ్ చౌదరి క్లారిటీ ఇచ్చేశారు. దీంతో ఏపీ ప్రజలకు హోదాపై ఉన్న అపోహలు పూర్తిగా తొలగిపోయినట్లు అయ్యింది. రాష్ట్రానికి పదేళ్ల పాటు ప్రత్యేక హోదా ఇస్తామని 2014లో నాటి ప్రధాన మంత్రి మన్మోహన్ సింగ్ పార్లమెంట్‌లో ప్రకటించారు. కానీ ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ఎన్‌డీఏ ప్రభుత్వం... ఆ హామీని పక్కన పెట్టేసింది. దీనిపై గత ముఖ్యమంత్రి చంద్రబాబు, పలువురు సామాజిక వేత్తలు రాజకీయ నేతలు ఎన్ని సార్లు కేంద్రం వద్ద ప్రస్తావించినా కూడా ప్రయోజనం లేకుండా పోయింది. చివరికి కేంద్రంతో టీడీపీ తెగదెంపులు కూడా చేసుకుంది. చివరికి ఇది ముగిసిన అధ్యాయంటూ కొత్త వాదన కూడా మొదలు పెట్టేసింది కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ.


మరింత సమాచారం తెలుసుకోండి: