ఇపుడిదే అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి ఒకే విధంగా ఉండటమే విచిత్రంగా ఉంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఇద్దరు కూడా తమకు ఓట్లేయనందుకు ఓడగొట్టినందుకు జనాలనే తప్పుపడుతున్నారు. తమ ఓటమికి జనాలనే ఇద్దరు నిందిస్తున్నారు. ఎన్నికలు జరిగి మూడేళ్ళవుతోంది. మరో రెండేళ్ళల్లో షెడ్యూల్ ఎన్నికలు రాబోతున్నాయి.





అయినా సరే ఇప్పటికీ చంద్రబాబు, పవన్ జనాలనే తప్పుపడుతుండటమే ఆశ్చర్యంగా ఉంది. అంటే తమకు ఓట్లేస్తేనేమో జనాలు విజ్ఞులు, మంచివారు, తెలివైన వాళ్ళు. అదే వ్యతిరేకంగా వేస్తే మాత్రం ఓటర్లు తప్పుచేసినట్లే. పవన్ ఎక్కడ బహిరంగసభలో మాట్లాడినా ఇప్పటికీ తనను రెండుచోట్లా ఓడించినందుకు జనాలనే నిందిస్తున్నారు. తనను ఓడించిన జనాలకు మద్దతుగా తాను ఎందుకు నిలబడాలన్నట్లుగా జనాలను నిందిస్తున్నారు. అంటే తాను రెండుచోట్లా ఓడిపోయిన మంట పవన్ను ఇంకా వదల్లేదని అర్ధమైపోతోంది.





గెలిచేసీట్లేవో సరిగ్గా చూసుకోకుండా రెండు చోట్లా పోటీచేసిన తనదే తప్పని పవన్ ఇప్పటికీ తెలుసుకోలేకపోతుండటమే విచిత్రంగా ఉంది. తప్పు తానుచేసి ఓట్లేయని జనాలను ఇంకా నిందిస్తున్నారు. ఇక మహానాడులో కూడా చంద్రబాబు, అచ్చెన్నాయుడు జనాలనే నిందించారు. జగన్ ఒక్క ఛాన్సంటే నమ్మి వైసీపీకి ఓట్లేశారని చెప్పి జనాలనే నిందించారు. వైసీపీకి ఓట్లేసి గెలిపించినందుకు మీకు ఈ శాస్తి జరగాల్సిందే అని శాపనార్ధాలు పెడుతున్నట్లుగా ఉంది వీళ్ళ వ్యవహారం.





నిజంగా ప్రజానాయకులన్నవారు ఎవరూ ఓట్లేయని జనాలను తప్పుపట్టరు, నిందించరు, శాపనార్ధాలు పెట్టరు. తమకు ఎందుకు ఓట్లేయలేదు, ఎందుకు ఓడగొట్టారనే విషయాన్ని నిజాయితిగా విశ్లేషించుకుంటారు. పలానా తప్పులు చేయబట్టే జనాలు ఓట్లేయలేదన్న విషయాన్ని గ్రహించి చేసిన తప్పులను ప్రజలముందు ఒప్పుకుంటారు. అప్పుడు జనాల్లో నమ్మకం వస్తే మళ్ళీ ఓట్లేస్తారు. ప్రజల్లో నమ్మకం కలిగించి ఓట్లు వేయించుకునేట్లుగా నేతల మాటలుండాలి కానీ తప్పుపడితే మొదటికే మోసం వచ్చే ప్రమాదముంది. ఈ విషయాన్ని ఈ ఇద్దరు గ్రహించకపోవటమే విచిత్రంగా ఉంది.




మరింత సమాచారం తెలుసుకోండి: