కర్నాటక ఎన్నికల్లో గెలుపుపై తెలంగాణా బీజేపీ నేతలు చాలా ఆశలను పెట్టుకున్నారు. అందుకనే తెలంగాణా చీఫ్ బండి సంజయ్ తో పాటు చాలామంది సీనియర్లు కర్నాటక ఎన్నికల్లో విస్తృతమైన ప్రచారంచేశారు. కర్నాటకలో గనుక బీజేపీ గెలిస్తే దాని ప్రభావం తెలంగాణాలో కూడా పడక తప్పదని కమలనాదులు చాలా గట్టి నమ్మకం పెట్టుకున్నారు. అయితే వాళ్ళ ఆశలపై కన్నడిగులు నీళ్ళు చల్లేశారు. ప్రీపోల్ సర్వేలు, ఎగ్జిట్ పోల్ సర్వేల్లో వెల్లడైనట్లే కర్నాటక బీజేపీ 64 నియోజకవర్గాల్లో గెలుపుతో సరిపెట్టుకున్నది. కాంగ్రెస్ 136 సీట్లతో మంచి విజయం సాధించింది.




ఇక్కడ విషయం ఏమిటంటే కర్నాటకలో గెలుపును చూపించి తెలంగాణాలో బీజేపీలోకి వలసలను భారీ ఎత్తున ప్రోత్సహించాలని సీనియర్లు గట్టిగా అనుకున్నారు. చాలాకాలంగా బీజేపీలోకి చెప్పుకోతగ్గ నేతలు ఎవరూ పెద్దగా  చేరలేదు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తున్నాయి. మరోవైపు చాలా నియోజకవర్గాల్లో గట్టి అభ్యర్ధుల కొరత బీజేపీని పట్టి పీడిస్తోంది. అందుకనే కర్నాటక ఎన్నికల ఫలితాలను చూపించి తెలంగాణాలోని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలను లాక్కోవాలని ప్లాన్ చేశారు.




అయితే కర్నాటకలో కాంగ్రెస్ మంచి మెజారిటితో అధికారంలోకి వచ్చేసింది. తాజాగా కర్నాటకలో బీజేపీ ఓడిపోవటంతో దాని ప్రభావం తెలంగాణాలో కూడా పడే అవకాశముంది. కర్నాటకలో గెలిస్తే తెలంగాణాలో ఎంతమంది నేతలు చేరుండే వారో తెలీదు. అయితే అక్కడ ఓడిపోవటంతో  ఇక్కడ బీజేపీలో చేరేవాళ్ళు ఎవరూ కనబడటంలేదు. కర్నాటక ఎన్నికల్లో గెలుపును నరేంద్రమోడీ అత్యంత ప్రతిష్టగా తీసుకున్నారు.




అంత ప్రతిష్టగా తీసుకున్నా ఓడిపోక తప్పలేదు. మరి ఇపుడు తెలంగాణాలో కమలనాదులు ఏమిచేస్తారు ? కర్నాటకలో గెలవటంతో కాంగ్రెస్ నేతలు మంచి ఉత్సాహం మీదున్నారు. కాబట్టి తెలంగాణాలో కాంగ్రెస్ నుండి బీజేపీలోకి నేతలెవరు చేరే అవకాశాలు లేవు. ఈ నేపధ్యంలో ఉన్న నేతలను బయటకు పోకుండా కాపాడుకోవటమే కమలనాదులకు ఇపుడు తలకుమించిన పనయ్యేట్లుంది. పార్టీని అన్నీ నియోజకవర్గాల్లో బలోపేతం చేసుకోకుండా ఎంతసేపు కేసీయార్ ను తిట్టడం, భాగ్యలక్ష్మి దేవాలయంలో ప్రమాణాలు, పూజలతోనే బండి అండ్ కో కాలం గడిపేస్తున్నారు. మొత్తానికి తెలంగాణా బీజేపీ ఆశలపై కర్నాటక ఎన్నికల ఫలితాలు నీళ్ళు చల్లేసిందైతే వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: