రాబోయే ఎన్నికల్లో మంచి ఫైట్ ఉంటుందని అనుకుంటున్న నియోజకవర్గాల్లో మంగళగిరి కూడా ఒకటి. ఇక్కడ మంచి ఫైట్ జరుగుతుందని ఎందుకు అనుకుంటున్నారంటే టీడీపీ తరపున నారా లోకేష్ పోటీచేస్తున్నారు కాబట్టే. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన లోకేష్ మళ్ళీ ఇక్కడినుండే పోటీచేసి గెలవాలని పట్టుదలతో ఉన్నారు. ఇదేసమయంలో లోకేష్ ను రెండోసారి కూడా ఓడించి దెబ్బకొట్టాలన్నది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. గెలుపు, ఓటముల కోసం రెండువైపులా ఎవరి వ్యూహాలు వాళ్ళుపన్నుతున్నారు.





కుప్పంలో చంద్రబాబునాయుడును, మంగళిరిలో లోకేష్ ను ఓడించటమే టార్గెట్ గా పెట్టుకున్నారు జగన్. ఇందులోభాగంగానే రాజధాని నియోజకవర్గాలైన మంగళగిరి, తాడికొండలో ఆర్ -5 జోన్ అనే ప్రాంతాన్ని ఏర్పాటుచేశారు. ఈ ప్రాంతంలో 54 వేలమంది పేదలకు ఇళ్ళపట్టాలు ఇవ్వబోతున్నారు. పట్టాల పంపిణీకి రంగంమంతా సిద్ధమైపోయింది. పట్టాలు అందుకోబోయే లబ్దిదారులంతా విజయవాడ పశ్చిమ, సెంట్రల్ తో పాటు గుంటూరు జిల్లాలోని పొన్నూరు నియోజకవవర్గాల వాళ్ళు.





పై మూడు నియోజకవర్గాల్లోని పేదలకు మంగళగిరి, తాడికొండలో పట్టాలిస్తున్నారు. మంగళగిరి నియోజకవర్గం పరిధిలోని కృష్ణాయపాలెం, నవులూరు, కురగల్లు, నిడమర్రు గ్రామాల్లో సుమారు 30 వేలమంది పట్టాలు అందుకోబోతున్నారు.  ప్రతి లబ్దిదారుడి ఇంట్లోను తక్కువలో తక్కువ 2 ఓట్లు వేసుకున్నా మొత్తంమీద 60 వేల ఓట్లు కొత్తగా వస్తాయి. పట్టాల పంపిణీ అయిపోగానే  వీళ్ళ ఓట్లన్నింటినీ మంగళగిరి నియోజకవర్గంలో నమోదుచేయిస్తారు. అంటే జగన్ కొత్తగా ప్రత్యమ్నాయ ఓటుబ్యాంకును సృష్టించుకుంటున్నారు. సంక్షేమ పథకాల లబ్దిదారులూ తమకే ఓట్లేస్తారని అనుకుంటున్నారు.





లబ్దిదారులంతా రాబోయే ఎన్నికల్లో వైసీపీకే ఓట్లేస్తే లోకేష్ ఓటమి తప్పదు. అయితే ఈ విషయాలను ఊహించి టీడీపీ కూడా పై ఎత్తులు వేస్తోంది. లోకేష్ తరపున కొందరు రెగ్యులర్ గా నియోజకవర్గంలో తిరుగుతునే ఉన్నారు. తోపుడుబళ్ళ వ్యాపారులు, పేవ్మెంట్ల మీద పండ్లు, కూరగాయలు అమ్ముకునే వాళ్ళకి అవసరమైన సాయాలు చేస్తున్నారు. కొందరికి ఆటోలు కొనిచ్చారు. బండ్లమీద టిఫెన్లు అమ్ముకునే వాళ్ళకి అవసరమైన సామగ్రిని కొనిచ్చారు. దీనికి అదనంగా ప్రభుత్వంపైన వ్యతిరేకతను నమ్ముకున్నారు. అంటే గెలుపుకోసం ఇటు జగన్ అటు లోకేష్ వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో బిజీగా ఉన్నారు. మరి చివరకు ఏమవుతుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: