ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పల్లెలలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.ఎన్నికలకు షెడ్యూల్ ప్రకటించడంతో గ్రామాలలో పార్టీలు వ్యూహాత్మకంగా ఎన్నికల బరిలోకి దిగాలని, విజయం సాధించే అభ్యర్థులనే, గెలుపు గుర్రాలనే బరిలో నిలపాలని తెగ కసరత్తులు చేస్తున్నాయి. పోటీలో నిలిచే అభ్యర్థులతో , రాజకీయ చర్చలతో గ్రామాల్లో సందడి వాతావరణం మొదలైంది. ఆంధ్రప్రదేశ్ లో స్థానిక ఎన్నికలను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోవడానికి ఈ ఎన్నికలు తమకు ఎంతో ఉపకరిస్తాయని ఆయా పార్టీల నాయకులు సమావేశాలు నిర్వహిస్తూ, సమీకరణలు మొదలుపెట్టారు.