కడప జిల్లాలో తొలిరోజు మొత్తం 211 మంది నామపత్రాలను ఉపసంహరించుకున్నారు. ఇప్పటివరకు జిల్లాలో పులివెందులతో కలిపి మొత్తం 100 వార్డులు ఏకగ్రీవమైనట్లు తెలిసింది. వీరంతా వైకాపా అభ్యర్థులు, సానుభూతిపరులేనని సమాచారం. ఈ స్థానాల ఏకగ్రీవాలపై అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. నేడు మధ్యాహ్నం 3 గంటలకు ఉపసంహరణ ప్రక్రియ ముగియనుంది. మరో వైపు మైదుకూరు పురపాలక సంఘంలో 5 నామపత్రాలను ఉపసంహరించుకోగా.. వీటిలో వైకాపా 4, తెదేపా 1 ఉన్నాయి. ఇక్కడ ఏకగ్రీవాలు జరగకుండా చూసేందుకు తెదేపా నియోజకవర్గ బాధ్యుడు పుట్టా సుధాకర్‌యాదవ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. తమ పార్టీ అభ్యర్థులతో ఉపసంహరణకు వీల్లేకుండా వారిని రహస్య ప్రాంతానికి తరలించగా నేటి సాయంత్రం వారు తిరిగి రానున్నట్లు సమాచారం.