అధికార పార్టీని విపక్షం తిట్టడం.. లేడి పరుగుపెట్టినంత కామన్ విషయం. విపక్షానికి బాధ్యత లేదని అధికార పార్టీ మండిపడటం.. నీరు పల్లానికి వెళ్లినంత సులువైన మ్యాటర్. ఇది రాజకీయాల్లో నిత్యం చూసే విషయాలే. అధికార పక్షం తప్పులను విపక్షం ఎత్తి చూపాలి. పాలనలో లోపాలను ఎప్పటికప్పుడు బహిర్గతం చేయాలి. సుపరిపాలన కోసం విపక్షం పోరాడాలి.
అప్పుడే ప్రతిపక్షానికి అసలైన విలువ, ప్రజామోదం లభిస్తాయి. అధికార పగ్గాలు అందుకునే అవకాశం లభిస్తుంది. అయితే ఏపీలో ప్రస్తుతం ఆ పరిస్థితి లేదట. ప్రతిపక్షమైన వైసీపీ ప్రజా సమస్యలపై పోరాడటం లేదట. చంద్రబాబు పాలనలో లోపాలను ఎత్తి చూపడంలో విఫలమైందట. ప్రజల కోసం ఆ పార్టీ చేసిందేమీ లేదట. ఈ విమర్శలన్నీ చేసింది అధికార పార్టీ అని అనుకోవడం సహజం.
కానీ ఈ మాటలన్నది అధికార పక్షం కాదు.. తోటి ప్రతిపక్షం. అవును.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా అధికార టీడీపీని తిట్టడం మానేసి తోటి ప్రతిపక్షం వైసీపీపై పడుతున్నారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష వైసీపీ ప్రజల సంక్షేమం విషయంలో పూర్తిగా విఫలమైందని కాంగ్రెస్ పార్టీ పీసీసీ ఉపాధ్యక్షుడు తులసీరెడ్డి లేటెస్టుగా ఆరోపించారు.
ప్రతిపక్షనేతగా ఉన్న జగన్ కు సరిగ్గా అనుభవం లేకపోవడం వల్లే ఇలా జరుగుతోందని ఆ తులసి రెడ్డి అన్నారు. జగన్ కు అధికార యావ తప్ప ప్రజల సంక్షేమం గురించి ఏమాత్రం పట్టడం లేదని ఆయన మండిపడుతున్నారు. కడప జిల్లాకు ఉక్కుపరిశ్రమ సాధించడంలో జగన్ అట్టర్ ఫ్లాప్ అయ్యాడని తులసి రెడ్డి అన్నారు. టీడీపీ, వైసీపీల తీరు మారకపోతే ఈసారి అధికారం కాంగ్రెస్ దేనని అంటున్నారు తులసిరెడ్డి. అబ్బో ఈ రెడ్డిగారికి చాలా ఆశలున్నట్టున్నాయి.