ఢిల్లీలో రాష్ట్ర రాజకీయాలపై మరోసారి ఊహాగానాలకు తెరలేస్తోంది. గురువారం సోనియా నేతృత్వంలో సమావేశమైన మినీ కోర్ట్ కమిటీ తెలంగాణ అంశంతోపాటు... రాష్ట్ర పరిణామాలపై రెండున్నర గంటలపాటు చర్చించారు. ఈ భేటీకి అహ్మద్ పటేల్, చిదంబరం, ఏకే ఆంటోని. వయలార్ రవి, గులాంనబీ ఆజాద్ తదితరులు హాజరయ్యారు.
మొత్తంమీద డిసెంబర్ నెలాఖరులోపు తెలంగాణపై ఏదో ఒక ప్రకటన చేసే అవకాశముందని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. ఈవిషయంపై ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని కూడా త్వరలో ఢిల్లీ పిలిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. ఏపీ వ్యవహారాలు, తెలంగాణ అంశంపై దృష్టిపెట్టి కాంగ్రెస్ హైకమాండ్ సీరియస్ గా కసరత్తు చేస్తుండటంతో ఢిల్లీలో ఏం జరుగుతుందోనని రాష్ట్ర నేతల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఇక తెలంగాణపై తాడో పేడో తేల్చాల్సి ఉందని పార్టీ నేతలంతా అభిప్రాయపడ్డట్లు తెలిసింది.
ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవడం అవసరమని కాంగ్రెస్ ఇప్పటికే ఒక నిశ్చయానికి వచ్చింది. తెలంగాణ ఇవ్వాలా వద్దా!? ఇస్తే హైదరాబాద్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? ఇవ్వడం వల్ల కాంగ్రెస్ పార్టీకి ఉభయ ప్రాంతాల్లో లభించే రాజకీయ ప్రయోజనాలేమిటి? ఇవ్వకపోతే ఏర్పడే పర్యవసానాలేమిటి? అంటూ అనేక అంశాలపై నేతలు సుదీర్ఘంగా చర్చించినట్లు తెలుస్తోంది.
ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్న ప్రతిపాదన కూడా కాంగ్రెస్ మదిలో ఉన్నట్టు సమాచారం. అయితే దీనికి తెలంగాణ కాంగ్రెస్ ఎంపీల నుంచి వ్యతిరేకత ఉందన్న విషయాన్ని అధిష్టానం గుర్తించినట్టు సమాచారం. ఈనెల 7న విజయవాడలో తలపెట్టిన ప్రాంతీయ సదస్సును వాయిదా వేసుకోవాలన్న అధిష్టానం పెద్దల నిర్ణయంపై రాష్ట్ర కాంగ్రెస్ నేతల్లో విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి నేడు అందరిదృష్టి జరగబోయే కోర్ కమిటీ మీటింగ్ పైనే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి