ఎవరు ఏపార్టీవారో తెలియని పరిస్థితి, పదవికోసం ఎవరితో ఎవరు కలిసిపోతారో అర్ధం కావడంలేదు, క్యాంపురాజకీయాలతోపాటు డబ్బు ప్రభావం ఎక్కువగా కనిపిస్తుంది. డబ్బులున్నవారే ఎన్నికల్లో పోటీ చేయాలనే పరిస్థితులు దాపురించాయి. నీతి, నియమం మంటకలిసింది. లక్షల రూపాలయలు వెదజల్లితే గెలిపించిన ఓటర్ల మనోభావాలను ప్రక్కనబెట్టి ప్రత్యర్థులకు అమ్ముడుపోయే పరిస్థితి డిసిసిబి ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది. అన్నిజిల్లాల్లో డిసిసిబి ఎన్నికల్లో రసవత్తర రాజకీయాలు నడుస్తున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశంపార్టీ, వైఎస్ఆర్ సిపిల మద్యన జరుగుతున్న రాజకీయాలు ఆసక్తిగా మారిపోగా కరీంనగర్ జిల్లాలో మాత్రం టిఆర్ఎస్ పాత్ర కీలకంగా మారింది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు సీమాంధ్రలో వైకాపా, కాంగ్రెస్, టిడిపి పార్టీలు పోటాపోటిగా డిసిసిబిలు దక్కించుకోవడం కోసం పావులు కదుపుతున్నాయి. మూడు పార్టీలు ఎవరికి వారు బద్ధ శత్రువులయినప్పటికిని ఏమాత్రం సిగ్గు పడకుండా వాటం చూసి డిసిసిబి పీఠాన్ని దక్కించుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నాయి. కొన్ని జిల్లాలో కాంగ్రెస్, వైకాపాలు కలిసి తెలుగుదేశం పార్టీని దెబ్బతీయడం కోసం ప్రయత్నిస్తుండగా మరికొన్ని జిల్లాలో తెలుగుదేశంపార్టీ, వైకాపాలు కలిసి కాంగ్రెస్ పార్టీని దెబ్బతీయడం కోసం తాపత్రయపడుతున్నాయి. కొంతమంది డబ్బులున్నటువంటి నాయకులు డిసిసిబి పీఠాన్ని దక్కించుకోవడం కోసం ఏపార్టీ సభ్యులకైనా సరే బంపర్ ఆఫర్ ఇస్తున్నారు. ఒక్కో సభ్యునికి 5లక్షల నుండి పరిస్థితులను బట్టి 10లక్షల రూపాయలు ఇవ్వడానికి సిద్దపడుతున్నారు. దీంతో ఈరోజుల్లో డబ్బులకు అమ్ముడు పోనివారెవ్వరు అనుకుంటున్నారో తెలియదుగాని డబ్బులు తీసుకుంటు తమకు ఓటువేసిన ఓటర్ల మనోభావాలను కదని క్యాంపుల్లోకి వెళ్లిపోతున్నారు. తమకు బలమున్న చోట డిసిసిబిలు దక్కించుకోవడానికి, అవసరమైతే ఇండిపెండెంట్ల మద్దతుతీసుకోవడం కోసం అన్ని పార్టీల నాయకత్వం దృష్టి సారించింది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఇందుకోసం జిల్లాకు ఒకరి చొప్పున బాధ్యులను కూడా నియమించింది. అయితే ఇదంతా డబ్బులముందు ఉత్తుత్తిగా మారిపోయింది. డిసిసిబిల ఎన్నికల్లో ముఖ్యంగా డబ్బు బలం పనిచేస్తున్నట్లుగా కనిపిస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: