హైదరాబాద్: వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ ఎప్పుడూ వార్తల్లో ఉండే విజయవాడ ఎంపీ ల(జ)గడపాటి రాజగోపాల్ తాజాగా మరో వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. పరోక్షంగా తన పార్టీ చీఫ్ బొత్సపై విరుచుకుపడ్డారు. పనిలో పనిగా మళ్లీ తెలం‘గానం’పై తనదైన శైలిలో మాట్లాడారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన మాటలతో తెలంగాణ ప్రజల్నిమభ్యపెడుతున్నారనీ, తెలంగాణకు వ్యతిరేకిగా ప్రణబ్ ముఖర్జీకి ముద్ర వేసి ఓట్లు వేయననీ కేసీఆర్ చెప్పారనీ, ఇప్పుడు అదే ప్రణబ్ ముఖర్జీ రాష్ర్టపతి అయ్యాడనీ, ఈ ఐదేళ్లు తెలంగాణ రాదనీ అంగీకరించినట్లేనా? అని ప్రశ్నించారు. రాష్ర్టపతి ప్రమేయం లేకుండా కొత్త రాష్ర్టాలు ఏర్పాటు కావనీ, ప్రణబ్కు తెలంగాణ వ్యతిరేకిగా ముద్ర వేసిన కేసీఆర్ తెలంగాణపై ఆశల్ని వదులుకున్నట్లేనా? అని కూడా లగడపాటి అన్నారు. ఓ వైపు పీసీసీ చీఫ్ బొత్సపై, మరో వైపు తెలంగాణ, కేసీఆర్ పై మాటల తూటాలను పేల్చి రాజగోపాల్ కొత్త పంచాయితీకి తెరలేపాడనీ చెప్పొచ్చు. సెప్టెంబర్ లో తెలంగాణ వస్తదనీ కేసీఆర్ చెబుతున్న మాటల్లో ఎంత మాత్రం వాస్తవం లేదనీ లగడపాటి అంటున్నారు. కేసీఆర్ దొంగ మాటలతో ఆ ప్రాంత ప్రజలు మోసం చేస్తున్నాడే తప్ప మరొకటి కాదన్నారు. రాజగోపాల్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల్లో కూడా నిజం లేకపోలేదు. కొత్త రాష్ర్టం ఏర్పాటు కావాలంటే రాష్ర్టపతి పాత్రనే కీలకం. ప్రణబ్ తెలంగాణకు వ్యతిరేకి అని దానితో రాష్ర్టపతి ఎన్నికల్లో ఓటు వేయకుండా దూరంగా ఉంటున్నట్లు టీఆర్ఎస్ బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది.  ఇప్పుడు అదే ప్రణబ్ రాష్ర్టపతి అయ్యాడు. రాష్ర్టపతి అయిన ప్రణబ్ తెలంగాణ విషయంలో కేసీఆర్ చెప్పినట్లుగానే వ్యవహారిస్తే ఇక ఇప్పట్లో తెలంగాణపై ఆశలు వదులుకోవల్సిందే. 2009 డిసెంబర్ 9న కేంద్రం తెలంగాణను ప్రకటించినప్పుడు ప్రణబ్ ఢిల్లీలో అందుబాటులో లేరు. ఆ సమయంలో ఆయన ఢిల్లీలో ఉండి ఉంటే ఇలా జరిగి ఉండేది కాదనీ పార్టీ అధినేత సోనియానే ఓ సందర్భంలో అన్నట్లు వార్తలు కూడా వచ్చాయి. రాష్ర్టం విడిపోతే తప్పేముందన్న పీసీసీ చీఫ్ బొత్సపై కూడా రాజగోపాల్ విసుర్లు విసిరారు. రాష్ర్టం కలిసి ఉన్నప్పుడే క్రిష్ణా డెల్టాకు నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేయకుండా అడ్డుకున్నారనీ, విడిపోతే తమ ప్రాంత పరిస్థితి ఏమిటంటున్నారు. రాష్ర్టం విడిపోతే ఏమవుతుందటున్న వారు క్రిష్ణా డెల్టాకు నీళ్లను ఎందుకు ఇవ్వరనీ అడుగరనీ పీసీసీని ఉద్దేశించి అన్నారు.  మొత్తానికి రాజగోపాల్ ఒకే రోజు పార్టీ పీసీసీ చీఫ్ బొత్సపై పరోక్షంగా, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై ప్రత్యక్షంగా విరుచుకుపడ్డారు. విమర్శనాస్ర్తాలను సంధించారు. ఎట్టి పరిస్థితుల్లో తెలంగాణ రాదనీ తేల్చి చెప్పేశారు. లగడపాటి పీసీసీ చీఫ్ బొత్స, తెలంగాణ రాష్ర్ట ఏర్పాటు పై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు మళ్లీ ఎటు వైపు దారితీస్తాయో చూడాలి మరి.  

మరింత సమాచారం తెలుసుకోండి: