హైదరాబాద్: ‘అత్త మీది కోపం దుత్త మీద తీసిన’చందంగా తయారైంది రాష్ర్టంలోని పలు రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల పని తీరు. ఎవరికి కోపం వచ్చిన రాష్ర్ట బంద్ అని, విద్యా సంస్థల బంద్ కు పిలుపునివ్వడం ఇటీవలి కాలంలో ఆనవాయితీగా మారింది. పోటీ పడి పార్టీలు, విద్యార్థి సంఘాలు బంద్ లకు పిలుపునిస్తున్నాయి. బంద్ పాటించకపోతే దాడులకు పాల్పడిన దాఖలాలు ఉన్నాయి. బంద్ లు భావి భారత విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడుతున్నాయి. వారి భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారుతోంది. ముఖ్యంగా తెలంగాణలో ఇది శ్రుతి మించింది. అయిన దానికి, కాని దానికి బంద్ లకు పిలుపునిస్తున్న తీరు ప్రజల్ని ముఖ్యంగా విద్యార్థుల్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది. తరుచూ బంద్ ల నేపథ్యంలో విద్యార్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినప్పటికీ బంద్ లకు పిలుపునివ్వడం మాత్రం ఆయా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు మానుకోవడం లేదు. ఈ నెలలో మూడు మార్లు విద్యార్థి సంఘాలు బడులు బంద్ కు పిలుపునిచ్చాయి. బంద్ ల వల్ల ఆర్థికంగానూ నష్టపోవల్సి వస్తుందనీ పలువురు విద్యార్థుల తల్లిదండ్రలు ఈ ప్రతినిధి వద్ద మాట్లాడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. బంద్ లతో చదువులు సాగడం లేదు. తాము ఫీజులు చెల్లించక తప్పడం లేదనీ వారు వాపోతున్నారు. సమస్యల పరిష్కారానికి పని చేయాల్సిన విద్యార్థి సంఘాలే విద్యార్థులకు సమస్యగా మారుతున్నారు. గడిచిన రెండున్నర ఏళ్లుగా ముఖ్యంగా తెలంగాణలో చదువులు సాఫీగా జరగడం లేదు. తెలంగాణ ఉద్యమం పుణ్యమా అని బడులకు బంద్ లే బందులు. రోజుల తరబడిగా విద్యా సంస్థలకు బంద్ లు పిలుపునివ్వడంతో చదువులు సాగడం లేదు. దీనితో ఈ విద్యా సంవత్సరంలో తెలంగాణలోని మెదక్, వరంగల్, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ జిల్లాల నుంచి లక్షకు పైగా మంది విద్యార్థుల ఆంధ్ర, బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు చదువు‘కొనే’ నిమిత్తం వెళ్లినట్లు ఒక అంచనా. దీన్ని బట్టి బంద్ ల ప్రభావం విద్యార్థుల మీద ఎంతగా పడ్డదో వేరే చెప్పనక్కర్లేదు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు అందరికీ వుంది. దానికి ఎవరూ కాదన లేరు. కానీ, ఇది హద్దులు దాటుతోంది. మనకు నిరసన తెలిపే హక్కు ఎదుటి వారికి నష్టపరిచే విధంగా చేయడం ముమ్మాటికీ తప్పే. లక్షల రూపాయలు పెట్టి తల్లిదండ్రులు పిల్లల్ని చదివిస్తున్నారు. తరుచూ బంద్ లతో విద్యా సంవత్సరమంతా నష్టపోవల్సి వస్తుందనీ విద్యార్థులు విచారం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాలు పిలుపునిచ్చే బంద్ లనుంచి విద్యా సంస్థలను మినహాయించాల్సిందిగా విద్యార్థులు కోరుతున్నారు. తరుచూ బంద్ ల వల్ల అమూల్యమైన సమయమంతా వ్రుధాగ పోతుందంటున్నారు. విద్యా సంస్థల యజమానులు ఫీజుల రూపంలో లక్షల రూపాయల్లో వసూలు చేస్తున్నారనీ బంద్ లవల్ల ఫీజుల రూపంలో ఇచ్చిన డబ్బులు కోల్పోవలసి వస్తుందనీ, చదువులు సక్రమంగా సాగడం లేదనీ వారంటున్నారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలు, విద్యార్థి సంఘాల నాయకులు ఆ దిశగా ఆలోచన చేయాలనీ, చేస్తారనీ మనమూ ఆశిద్ధాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: