తెలంగాణ అభివృద్ధి అదుర్స్...


గత మూడేళ్లుగా తెలంగాణలో నిరంతరం విద్యుత్‌ను సరఫరా చేస్తున్నామని, అన్ని రంగాల్లో పురోగతి సాధించామని, ఐటీ రంగంలో దేశంలోనే హైదరాబాద్ రెండో స్థానంలో ఉందని గవర్నర్ నరసింహన్ తన ప్రసంగంలో పేర్కొన్నారు. శుక్రవారం ప్రారంభమైన తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో గవర్నర్ ఉభయ సభల సంయుక్త సమావేశంలో ప్రసంగించారు. గవర్నర్ తెలుగులో ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. శాసనమండలి అధ్యక్షుడు, శాసనసభ స్పీకర్, ముఖ్యమంత్రి, శాసన మండలి సభ్యులు, శాసనసభ సభ్యులు అందరికీ అభినందనలు చెప్పారు. 


ఫోటోల తారుమారుపై విచారణ..



మహబూబ్‌నగర్‌– రంగారెడ్డి–హైదరాబాద్‌ ఉపాధ్యాయ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నిక బ్యాలెట్‌లో ఫోటోల తారుమారుపై విచారణ ప్రారంభమైంది. ఎన్నికల విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన అధికారులకు హైదరాబాద్‌ జిల్లా ఎన్నికల అధికారి జనార్ధన్‌ రెడ్డి మెమోలు జారీ చేశారు. బ్యాలెట్‌ పేపర్‌ ముద్రణ బాధ్యతలు నిర్వర్తించిన జీహెచ్‌ఎంసీ అడిషనల్‌ కమిషనర్‌ జీ. రమేష్‌, ఎస్టేట్‌ ఆఫీసర్‌ సూర్యకుమార్‌, అడిషనల్‌ ఎస్టేట్‌ కమిషనర్‌ శ్రీనివాస్‌ రెడ్డికి మెమోలు జారీ అయ్యాయి.


లోకేశ్ .. ఇక ఎమ్మెల్సీ...


ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీల ఎన్నిక ప్రక్రియ ఏకగ్రీవంగా పూర్తి అయ్యింది. అధికార తెలుగుదేశం పార్టీ నుంచి ఐదు మంది, ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ నుంచి ఇద్దరు ఎమ్మెల్సీ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు అసెంబ్లీ కార్యదర్శి నుంచి వీరు ధ్రువీకరణ పత్రాలను అందుకున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి నారా లోకేష్, కరణం బలరాం, డొక్కా మాణిక్య వరప్రసాద్, అర్జునుడు, పోతుల సునీతలు ఎమ్మెల్సీలయ్యారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఆళ్ల నాని, గంగుల ప్రభాకర రెడ్డిలు ఎన్నికయ్యారు.


శ్రీనివాస్ కూచిభొట్ల జయంతి: కొవ్వొత్తుల ర్యాలీ..


అమెరికాలోని కాన్సాస్‌లో హత్యకు గురైన శ్రీనివాస్ కూచిభొట్లకు సంతాపంగా తెలంగాణ ఎన్నారై పేరెంట్స్ అసోసియేషన్ కేబీఆర్ పార్క్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. గురువారం ఆయన పుట్టిన రోజు. జాత్యాహంకార కాల్పుల్లో మృతి చెందిన ఆయనకు సంతాపం తెలియజేస్తూ ఆయన 33వ పుట్టిన రోజు సందర్భంగా గురువారం సాయంత్రం వాక్ నిర్వహించారు. ఆయన సతీమణి సునయన కూడా తన భర్తను గుర్తు చేసుకుంటూ ఓ లేఖ రాశారు.


తన్నుకున్న తెలుగు తమ్ముళ్లు...


అనంతపురం టీడీపీలో మంత్రి పరిటాల సునీత, టీడీపీ ఎమ్మెల్యే వరదాపురం సూరి వర్గీయుల మధ్య విద్యుత్ కేబుల్ పనుల విషయంలో గొడవ తలెత్తగా ధర్మవరంలో ఉద్రికత్త వాతావారణం నెలకొంది. ఈ విషయంపై ఎమ్మెల్యే సూరి తన వర్గీయులతో సహా వెళ్లి జిల్లా ఎస్పీని కలిసి మంత్రి పరిటాల వర్గీయులపై ఫిర్యాదుచేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శుక్రవారం మధ్యాహ్నం నుంచే ఉద్రిక్త పరిస్థితులున్నప్పటికీ... డీఎస్పీ నిర్లక్ష్యంగా వ్యవహరించారన్న విషయాన్ని ఎస్పీ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. టీడీపీలో చిన్న చిన్న గొడవలు సహజమేనని, అయితే ఆ గొడవలను ఒక కుటుంబంలా సర్దుబాటు చేసుకుంటామని ఎమ్మెల్యే వరదాపురం సూరి అన్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: