పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇప్పటికే పోలవరం టెండర్లను రివర్స్ టెండరింగ్ ద్వారా మళ్లీ పిలుస్తామని ఆయన ప్రకటించారు. తాజాగా పోలవరం ప్రాజెక్టు పనులు నుంచి ఓ ప్రముఖ కంపెనీని తొలగించారు. చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు ద్వారా భారీ అవినీతికి పాల్పడ్డారని భావిస్తున్న జగన్.. ఆ వివరాలన్నీతిరగతోడుతున్నారు.


జగన్ ప్రయత్నాలు ఇలా ఉంటే.. ఆయన తీరును దారుణంగా విమర్శిస్తోంది తెలుగుదేశం. చంద్రబాబు, లోకేశ్, ఉమా వంటి వారు జగన్ తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ విమర్శల నేపథ్యంలో వైసీపీ సీనియర్ నేత విజయసాయిరెడ్డి ఓ ఘాటు ట్వీట్ పోస్టు చేశారు. జగన్‌మోహన్‌రెడ్డికి కుల, వర్గ బలహీనతలు లేవని విజయసాయిరెడ్డి తెలిపారు.


పోలవరం ప్రాజెక్టుల పనులకు సంబంధించి రివర్స్‌ టెండరింగ్‌ అమల్లోకి వస్తుందనగానే టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడుకు, దేవినేని ఉమాకు వెన్నులో వణకు పుడుతుందా అని ప్రశ్నించారు. అలాగే పోలవరం ప్రాజెక్టులో దోచుకున్న ప్రతి రూపాయిని కక్కిస్తామని హెచ్చరించారు. ఆంధ్రప్రదేశ్‌ను అవినీతి లేని రాష్ట్రంగా తీర్చిదిద్దడానికి ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి కృషి చేస్తున్నారని విజయసాయిరెడ్డి తెలిపారు.


ఏపీకి కొత్త ఇమేజీ తీసుకొస్తానని సీఎం వైయస్‌ జగన్‌ చెబుతుంటే.. రాష్ట్రానికి పరిశ్రమలు రావని పచ్చపార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో ఐటీ, ఈడీ దాడులు జరిగినప్పుడు కూడా ఇలానే మాట్లాడారని గుర్తుచేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేసిన చంద్రబాబు.. అది లేకుండా పనులెలా జరుగుతాయనడంలో వింతేమీ లేదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.


పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టుల విషయంలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో సీఎం వైయస్‌ జగన్‌ ప్రాజక్టుల పనుల్లో పారదర్శకత కోసం రివర్స్‌ టెండరింగ్‌ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు. అందులోనూ తొలిగా పోలవరం ప్రాజెక్టు పనులకు రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించనున్నారు. ఈ క్రమంలో రివర్స్‌ టెండరింగ్‌కు జలవనరుల శాఖ పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది. రివర్స్‌ టెండరింగ్‌తో భారీ మొత్తంలో ప్రజాధనం ఆదా అవుతుందని నిపుణులు భావిస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: