ఉత్తర్ ప్రదేశ్  పంట పండింది. ఆ రాష్ట్రం బంగారు గనిగా మారబోతోంది. ఆ రాష్ట్రంలో అపరిమితమైన బంగారు నిల్వలు ఉన్నట్టు తేలింది. సోన్ భద్ర జిల్లాలో 3 వేల 650 మెట్రిక్  టన్నుల బంగారు నిక్షేపాలను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనిపెట్టింది. దీని విలువ దాదాపు... 12 లక్షల కోట్ల రూపాయలు ఉంటుందని అంచనా వేస్తున్నారు.

 


సోన్ పహాది, హార్ది ప్రాంతాల్లో బంగారు నిక్షేపాలు ఉన్నట్లు సొన్ భద్ర జిల్లా మైనింగ్ అధికారి తెలిపారు. ఇ-టెండరింగ్ ద్వారా బ్లాక్ ల వేలం త్వరలో ప్రారంభం అవుతుందని చెప్పారు. ఆయా ప్రాంతాలను జియో ట్యాగింగ్  చేసేందుకు ఏడుగురు సభ్యుల కమిటీని నియమించినట్లు  ఆ రాష్ట్ర గనుల శాఖ డైరెక్టర్ తెలిపారు.

 


ఈ ప్రాంతంలో  బంగారంతో పాటు ఉక్కు, పొటాషియం వంటి విలువైన నిక్షేపాలు కూడా ఉన్నట్లు జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా  తెలిపింది. సోన్ భద్రలో బంగారు నిల్వలను కనుగొనే పనులను దాదాపు రెండు దశాబ్దాల క్రితం 1992-93లో జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రారంభించింది. 2005 లో పసిడి అన్యేషణను ప్రారంభించిన జీఎస్సై 2012 లో ప్రాథమికంగా క్షేత్రాలను కనుగొంది. సోన్ పహాడిలో  2 వేల 943.26 మెట్రిక్  టన్నుల నిక్షేపాలున్నాయి. 

 


హార్ది బ్లాక్ వద్ద 6 వందల 46.16 మెట్రిక్  టన్నుల బరువున్న నిక్షేపాలున్నాయి. ప్రపంచ బంగారు కౌన్సెల్ ప్రకారం  దేశంలో ప్రస్తుతం 626 టన్నుల బంగారు నిల్వలున్నాయి. కొత్త నిల్వలు ఆ మొత్తానికి దాదాపు 5 రెట్లు ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. ఇప్పుడు ఈ నిల్వలను ఎంత త్వరగా వెలికి తీయాలా అన్న ఆలోచన రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు చేస్తున్నాయి. బంగారం సరఫరా పెరిగితే కాస్త ధరలు తగ్గే అవకాశాలు లేకపోలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: