వైసీపీ సానుభూతి ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఏపీ సీఎం జగన్ ఆశయాలకు, లక్ష్యాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్నతాధికారులు పని చేస్తున్నారని గన్నవరంలో మాత్రం రాజకీయ దళారులు తయారై జగన్ ఆశయాలకు తూట్లు పొడుస్తున్నారని అన్నారు. గన్నవరంలో కొందరు ఇళ్ల స్థలాల లబ్ధిదారుల నుండి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. 10,000 రూపాయల నుండి 30,000 రూపాయల వరకు వసూలు చేస్తున్నట్లు చెప్పారు. 
 
ఈ మేరకు ఒక ప్రకటనను ఎమ్మెల్యే విడుదల చేశారు. డబ్బులు వసూలు చేస్తున్న రాజకీయ దళారులకు కొందరు రెవిన్యూ అధికారులు సహకరిస్తున్నారని అన్నారు. గన్నవరం నియోజకవర్గంలోని టంగుటూరు మండలంలోని మానికొండలో, గన్నవరం మండలంలోని కొండపావలూరు, కేసరపల్లి, ఇతర గ్రామాలలో డబ్బులు వసూలు చేస్తున్నట్లు తనకు ఫిర్యాదులు వచ్చాయని చెప్పారు. 
 
కొందరు రెవిన్యూ అధికారులు భూసేకరణలో అవకతవకలకు పాల్పడ్డారని సంచలన వ్యాఖ్యలు చేశారు. కొందరు రాజకీయ దళారులు రైతుకు, రెవిన్యూ అధికారులకు మధ్య మధ్యవర్తులుగా వ్యవహరించారని చెప్పారు. అవినీతికి పాల్పడిన రెవిన్యూ అధికారులపై, డబ్బులు వసూలు చేసిన రాజకీయ దళారులపై చర్యలు తీసుకోబోతున్నట్లు చెప్పారు. జగన్ ఆశయాలకు అనుగుణంగా తాను పని చేస్తానని చెప్పారు. 
 
నియోజకవర్గంలో అర్హులైన పేదవారికి సంక్షేమ పథకాలు అందేలా తాను కృషి చేస్తానని చెప్పారు. ఎవరైనా అర్హులై ఏ కారణం చేతనైనా పథకాల అమలు జరగకపోతే తన దృష్టికి తీసుకొనిరావాలని ప్రజలకు సూచించారు. గత ఎన్నికల్లో వంశీ గన్నవరం నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. కొన్ని కారణాల వల్ల వంశీ ప్రస్తుతం వైసీపీ సానుభూతి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. ఎమ్మెల్యే వంశీ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయవర్గాల్లో కలకలం రేపుతున్నాయి. సీఎం జగన్ వంశీ వ్యాఖ్యల పట్ల ఎలా స్పందిస్తారో చూడాల్సి ఉంది. అవినీతి రహిత పాలన దిశగా అడుగులు వేస్తున్న జగన్ కు వంశీ చేసిన వ్యాఖ్యలు కొంత ఇబ్బంది పెట్టేవే అని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: