స్థానిక సంస్థల ఎన్నికల ముందు టీడీపీ నేతల రాజీనామాలు ఆ పార్టీ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. కర్నూలు జిల్లాలో మంచి పట్టు ఉన్న నేతల్లో కేఈ కృష్ణమూర్తి, కేఈ ప్రభాకర్ ముఖ్యులు. కానీ ఎవరూ ఊహించని విధంగా కేఈ ప్రభాకర్ రాజీనామా చేయడం జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఈయన తన రాజీనామా లేఖను పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు పంపించారు. 
 
కేఈ ప్రభాకర్ పార్టీని వీడటానికి కొందరు నేతలు కూడా కారణమని వార్తలు వినిపిస్తున్నాయి. బీజేపీ ఎంపీ టీజీ వెంకటేష్, జిల్లా టీడీపీ అధ్యక్షుడు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి వల్లే ప్రభాకర్ పార్టీని వీడాడని వార్తలు వినిపిస్తున్నాయి. టీజీ వెంకటేష్ పేరుకు బీజేపీలో ఉన్నా కర్నూలు టీడీపీ వ్యవహరాల్లో ఇప్పటికీ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. వీరి వైఖరి వల్లే కేఈ ప్రభాకర్ పార్టీకి రాజీనామా చేశాడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. 
 
తమ్ముడి రాజీనామా విషయం గురించి కేఈ కృష్ణమూర్తి ఇప్పటికే స్పందించారు. తమ్ముడి రాజీనామా విషయం తనకు తెలియదని పార్టీ వీడే అంశం గురించి తమ్ముడు తనతో మాట్లాడలేదని చెప్పారు. ప్రభాకర్ వైసీపీలో చేరినా తనకు ఎటువంటి అభ్యంతరం లేదని వ్యాఖ్యలు చేశారు. ప్రభాకర్ మున్సిపల్ ఎన్నికల్లో సీట్ల కేటాయింపు వల్ల పార్టీ మారుతున్నట్లు చెబుతున్నా అసలు కారణాలు వేరే ఉన్నాయని జిల్లా టీడీపీ వర్గాల్లో వినిపిస్తోంది. 
 
చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే కేఈ ప్రభాకర్ పార్టీ వీడతారని ప్రచారం జరిగింది. ఆ సమయంలో చంద్రబాబు ఆయనకు ఎమ్మెల్సీతో పాటు నామినేటెడ్ పదవి ఇచ్చారు. టీడీపీ కోట్ల కుటుంబాన్ని దగ్గరకు తీసుకోవడం కూడా ఆయన పార్టీ మారడానికి మరో కారణం అని తెలుస్తోంది. జిల్లాలో వర్గ రాజకీయాలు పెరగటం, చంద్రబాబు తన మాటకు విలువ ఇవ్వకపోవటం, చెప్పిన నేతలకు టికెట్లు ఇవ్వకపోవడం, ఇతర కారణాల ప్రభాకర్ రాజీనామా చేశాడని జిల్లాలో ప్రచారం జరుగుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: