ఏపీ సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న సచివాలయంలో రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల కమిటీ సమావేశంలో పాల్గొని పలు అంశాలపై మాట్లాడారు. బ్యాంకులు రైతులకు మరిన్ని రుణాలు మంజూరు చేయాలని ఆయన కోరారు. రాష్ట్రంలో కౌలు రైతులకు ఇస్తున్న రుణాలు ఆశాజనకంగా లేవని... ముద్ర యోజన రుణాల శాతం చాలా తక్కువగా ఉందని చెప్పారు. రుణాల మంజూరు పెంచాలని సీఎం బ్యాంకర్లను సూచించారు. 
 
మే 15వ తేదీన రాష్ట్ర రైతులకు రైతుభరోసా పెట్టుబడి సాయం అందిస్తామని రైతులకు శుభవార్త చెప్పారు. రైతు భరోసా కేంద్రాలతో గ్రామాల్లో తీసుకొస్తున్న విప్లవాత్మక మార్పులకు సహకరించాలని బ్యాంకర్లను కోరారు. రైతులకు రైతు భరోసా కేంద్రాల ద్వారా విత్తనాలు, పురుగు మందులు, ఎరువులు, అందించనున్నట్లు తెలిపారు. బ్యాంకులతో ఆ వివరాలను అనుసంధానం చేస్తామని... తద్వారా సాగు చేస్తున్న పంటలకు తగిన విధంగా బ్యాంకులు రుణాలు ఇవ్వడానికి అవకాశం ఉంటుందని చెప్పారు. 
 
చిరు వ్యాపారులు, తోపుడు బండ్ల మీద చిన్నపాటి వ్యాపారం చేసుకునేవారికి జూన్ లో కొత్త పథకం తీసుకొస్తున్నట్లు తెలిపారు. వారికి 10,000 రూపాయల చొప్పున వడ్డీ లేని రుణాలు ఇవ్వాలనుకుంటున్నామని.... అందుకు బ్యాంకుల సహకారం చాలా అవసరం అని చెప్పారు. గోదావరి, కృష్ణా నదుల అనుసంధానం ద్వారా కరువు ప్రాంతాలకు నీరు ఇవ్వనున్నట్లు తెలిపారు. ప్రభుత్వం చేపట్టబోయే ప్రాజెక్టులకు బ్యాంకర్ల సహకారం కావాలని అన్నారు. 
 
రైతు భరోసా కేంద్రాల్లో బ్యాంకు మిత్రలను ఏర్పాటు చేసి బ్యాంకింగ్ సదుపాయం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆంధ్రా బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ పకీరస్వామి తెలిపారు. 5 కిలోమీటర్ల పరిధిలో బ్యాంకింగ్ సదుపాయం లేని 229 గ్రామాలను మ్యాపింగ్ చేశామని... 5,000 జనాభా పై బడిన 567 చోట్ల కోర్ బ్యాంకింగ్ సర్వీసులను ప్రారంభించామని అన్నారు. 1,10,000 మంది రైతులకు ఫిబ్రవరి నెలలో కిసాన్ క్రెడిట్ కార్డులు ఇచ్చామని తెలిపారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: