ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను తొలగిస్తూ తెచ్చిన ఆర్డినెన్స్, ఇచ్చిన జీవోలు చెల్లవంటూ ఆయన హైకోర్టులో వేసిన పిటీషన్ పై విచారణ కొనసాగుతోంది. ఈ కేసులో నిమ్మగడ్డ తరపు న్యాయవాది డివి సీతారామమూర్తి తమ వాదన వినిపించారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ ద్వారా ఎస్‌ఈసీగా ఉన్న రమేశ్‌కుమార్‌ పదవీ కాలాన్ని కుదించలేరని వాదించారు. నిమ్మగడ్డ తరువాత ఆ పదవిలోకి వచ్చే వ్యక్తికే ఆ ఆర్డినెన్స్‌ నిబంధనలు వర్తిస్తాయని సీతారామ మూర్తి తమ వాదన వినిపించారు.

 

 

ఎన్నికల కమిషన్‌ సంస్కరణల కోసం 2011లో కేంద్ర ప్రభుత్వం నియమించిన టాస్క్‌ఫోర్స్‌ కమిటీ చేసిన సిఫారసులకు జగన్ సర్కారు తాజాగా తెచ్చిన ఆర్డినెన్స్‌ విరుద్ధంగా ఉందని కూడా సీతారామమూర్తి వాదించారు. ఎన్నికల కమిషనర్ గా ఉన్న నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను నేరుగా తొలగించడం కుదరదు కనుక ఆర్డినెన్స్ ద్వారా పరోక్షంగా తొలగించారని... ఇది కక్ష పూరితమైన చర్యగా సీతారామమూర్తి వాదించారు.

 

 

అంతే కాదు.. ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ రాజ్యాంగంలోని అధికరణ 213 ప్రమాణాలకు తగినట్లుగా లేదని సీతారామమూర్తి వాదించారు. నిమ్మగడ్డ రమేశ్ కుమార్ కరోనా వ్యాప్తిని దృష్టిలో పెట్టుకుని స్థానిక ఎన్నికల్ని వాయిదా వేశారని ఆయన గుర్తు చేశారు. అయితే ప్రభుత్వం మాత్రం ఆ కక్షతో ఆయన్ని తొలగించాలని నిర్ణయించి.. దొడ్డి దారిన ఈ ఆర్డినెన్స్‌ తీసుకొచ్చిందన్నారు.

 

 

అసలు ఈ ఆర్డినెన్స్ జారీ చేయడమే దురుద్దేశంతో కూడుకున్నదని. రమేశ్‌ కుమార్‌ను నేరుగా తొలగించలేక, ఆర్డినెన్స్‌ ద్వారా పరోక్షంగా ఆ చర్యకు ఉపక్రమించిందని సీతారామమూర్తి వాదించారు. అధికరణ 243 (కె) మేరకు ఎస్‌ఈసీ పదవీ కాలానికి రాజ్యాంగ రక్షణ ఉందిని ఆయన చెప్పారు. అందువల్ల ఆర్డినెన్స్‌ చెల్లుబాటు కాదని.. దీన్ని కొట్టేస్తూ తీర్పు ఇవ్వాలని నిమ్మగడ్డ తరపు న్యాయవాది సీతారామమూర్తి హైకోర్టును కోరారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: