దాదాపు రెండు నెలలుగా డిపోలకే పరిమితమైన ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కనున్నాయి. సీఎం జగన్ ఆదేశాలతో బస్సు సర్వీసులను పునఃప్రారంభిస్తున్నట్టు ఆర్టీసీ ఎండీ మాదిరెడ్డి ప్రతాప్ తెలిపారు. కరోనా నియంత్రణ నిబంధనల ప్రకారం భౌతికదూరం పాటించేలా బస్సు సీట్లలో మార్పులు చేశామని ఆయన తెలిపారు. బస్ సర్వీసుల సంబంధిత వివరాలను అధికారులు నేడు ప్రకటించనున్నారు. అధికారులు నగరాలు, పట్టణాల మధ్య ఒక బస్టాండ్ నుంచి మరో బస్టాండ్ కు బస్సులు నడిపేలా ఏర్పాట్లు చేశారు. 
 
విశాఖ, విజయవాడ నగరాలలో సిటీ సర్వీసులకు కొంతకాలం తర్వాత అనుమతులు ఇస్తారని తెలుస్తోంది. బస్సు ఎక్కేముందు అధికారులు ప్రయాణికులకు థర్మల్ స్క్రీనింగ్ చేస్తారు. ప్రయాణికుల పేర్లు, ఫోన్ నంబర్లు, ఇతర వివరాలను నమోదు చేసుకుంటారు. అయితే ఇతర రాష్ట్రాలకు వెళ్లాలనుకునే ప్రయాణికులకు మాత్రం భారీ షాక్ తగిలింది. తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలు ఇతర రాష్ట్రాల బస్సులకు అనుమతివ్వబోమని చెప్పాయి. 
 
అందువల్ల కొంతకాలం అంతర్రాష్ట్ర సర్వీసులను నడపకూడదని జగన్ సర్కార్ భావిస్తోంది. మరోవైపు హైదరాబాద్, చెన్నై, బెంగళూరు నగరాల నుంచి ఏపీకి వచ్చేందుకు స్పందన వెబ్ సైట్ లో దరఖాస్తు చేసుకున్న వారిని ప్రత్యేక బస్సుల్లో తీసుకురావాలని ప్రభుత్వం భావిస్తోంది. ఇతర రాష్ట్రాల నుంచి ఏపీకి వచ్చే ప్రయాణికులకు వైరాలజీ పరీక్షలు నిర్వహిస్తారని సమాచారం. మరోవైపు కరోనా విజృంభణ వల్ల బస్సుల్లో సగం సీట్లలో మాత్రమే ప్రయాణికులకు అనుమతించాల్సి ఉందటంతో సంస్థకు భారీగా నష్టం వస్తోంది. 
 
ఈ నేపథ్యంలో నిన్న ఛార్జీల పెంపు గురించి కసరత్తు జరిగింది. ఆర్టీసీ అధికారులు 50 శాతం ఛార్జీలు పెంచేలా ప్రతిపాదనలు చేసి సీఎంకు పంపారు. కానీ చార్జీల పెంపు వద్దని సీఎం జగన్ ఆదేశించినట్లు తెలుస్తోంది. భవిష్యత్తులో మాత్రం ఆర్టీసీ చార్జీలు పెరిగే అవకాశం ఉందని సమాచారం. కర్ణాటక, తెలంగాణ ప్రభుత్వాలు అంతర్రాష్ట్ర సర్వీసులకు అనుమతులు ఇవ్వకపోవడంతో ఏపీలో చిక్కుకున్న ఇతర రాష్ట్రాల ప్రజలకు కొంతకాలం ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: