తీవ్ర ఎండలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న తెలుగురాష్ట్రాల్లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. తెలుగు రాష్ట్రాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిశాయ్‌. హైదరాబాద్‌ నగరం భారీ వర్షానికి తడిసి ముద్దయింది.

 

హైదరాబాద్‌లో వర్షం దంచి కొట్టింది. పలు ప్రాంతాల్లో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లిహిల్స్, పంజాగుట్ట, ఖైరతాబాద్, ఎల్.బి నగర్, వనస్థలిపురం, హయత్ నగర్, దిల్ సుఖ్ నగర్ మల్కాజ్ గిరి, ఉప్పల్ ఏరియాల్లో జోరు వాన కురిసింది. భారీ వర్షంతో  భాగ్యనగరంలో పలు ప్రాంతాల్లో   ట్రాఫిక్ జామ్ అయ్యింది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. నగరంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ సమాచారంతో అన్ని టీంలను అప్రమత్తం చేసింది జీహెచ్ఎంసీ.

 

మరోవైపు రాగల 48 గంటల్లో రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని తెలిపింది. ఛత్తీస్‌గఢ్‌ పరిసర ప్రాంతాల్లో 2.1 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీంతో నేడు, రేపు అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు తెలిపారు.

 

హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని పలు ప్రాంతాల్లో వర్షాలు కురిశాయ్‌. యాదాద్రి భువనగిరి జిల్లాలో తుర్కపల్లి, భువనగిరి, యాదగిరిగుట్ట, వలిగొండ ప్రాంతాల్లో భారీ వర్షం దంచి కొట్టింది. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. సిద్ధిపేట జిల్లాలో కొమురవెళ్లి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో కూడా వానలు పడ్డాయ్‌.

 

అటు ఏపీలోని కర్నూలు జిల్లాలోని శ్రీశైలం మహాక్షేత్రంలోభారీ వర్షం కురిసింది.  గంట పాటు ఈదురుగాలులు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఉపరితల ఆవర్తన ప్రభావంతో తెలుగు రాష్ట్రాలపై భానుడి ప్రతాపం కాస్త తగ్గింది. ఎండలతో ఉక్కిరి బిక్కిరి అయిన ప్రజలు వాతావరణం ఒక్కసారిగా చల్లబడటంతో ఊరట పొందారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: