వైసీపీలో కొందరు నేతల విధానాలపై అసంతృప్తితో ఉన్న నరసాపురం ఎంపీ రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి జగన్‌కు లేఖ రాశారు. యువజన శ్రామిక రైతు పార్టీకి తాను ఎప్పుడూ విధేయుడిని చెబుతూనే పార్టీ అనుసరిస్తున్న అంశాలపై తన అభ్యంతరాలను వ్యక్తం చేశారు. జగన్ చుట్టూ ఉన్న కోటరి తనపై తప్పుడు ప్రచారం చేస్తుందని ఆరోపించారు. కలిసేందుకు అనుమతివ్వాలని కోరారు.  

 

వైసీపీలో రెబల్‌గా మారిపోయిన ఎంపీ రఘురామకృష్ణరాజు పార్టీ అధ్యక్షుడికి లేఖ రాశారు. ఇటీవల విజయసాయిరెడ్డి ఇచ్చిన షోకాజ్ నోటీసుపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అనేక అంశాలను లేవనెత్తిన రఘురామకృష్ణరాజు.. ఈసారి నేరుగా జగన్మోహన్ రెడ్డికి లేఖ రాశారు. ఎన్నికల సంఘం వద్ద రిజిస్టరైన పార్టీ పేరుతో కాకుండా మరో పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఈసీ నిబంధనల ప్రకారం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేరును వాడుకునే అవకాశం లేదని... ఆ పార్టీ పేరుతో తనకు షోకాజ్ నోటీసు ఇవ్వడం సరికాదన్నారు. యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీకి మాత్రం తానెప్పుడూ విధేయుడినేనన్నారు.

 

పార్టీకి, తమకు వ్యతిరేకంగా ఇప్పటి వరకు తాను ఒక్క ముక్క కూడా మాట్లాడలేదని రఘురామకృష్ణరాజు స్పష్టం చేశారు. ఇసుక విషయాన్ని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించా... సాధ్యంకాకపోవడంతోనే మీడియాతో వివరించినట్టు లేఖలో ప్రస్తావించారు. మీ చుట్టూ ఉన్న కొందరు తనను క్రైస్తవ వ్యతిరేకిగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని జగన్ దృష్టికి తీసుకెళ్లారు. ఓ ప్రజాప్రతినిధిగా మిమ్మల్ని కలవకుండా చేస్తున్నది కూడా వారేనంటూ విమర్శించారు. 

 

కొన్ని విషయాల్లో తన అభిప్రాయాలను, అభ్యంతరాలను సూటిగా వ్యక్తం చేస్తే... దానిని పార్టీ వ్యతిరేక చర్యగా చూస్తున్నారని చెప్పారు. తాను వెంకటేశ్వర స్వామికి భక్తుడినని... ఆస్తుల అమ్మకం విషయంలో భక్తుల మనోభావాలను మాత్రమే తాను వివరించానన్నారు. ఈ విషయంలో తానెక్కడా పార్టీకి వ్యతిరేకంగా వ్యవహరించలేదన్నారు. కలిసేందుకు అనుమతివ్వాలంటూ జగన్‌కు విజ్ఞప్తి చేశారు

మరింత సమాచారం తెలుసుకోండి: