దేశంలో, తెలుగు రాష్ట్రాల్లో కరోనా మహమ్మారి శరవేగంగా వ్యాప్తి చెందుతున్న సంగతి తెలిసిందే. ఏపీలో 9,000కు అటూఇటుగా కేసులు నమోదవుతుండగా తెలంగాణలో గత కొన్ని రోజుల నుంచి 2,000 లోపే కేసులు నమోదవుతున్నాయి. అయితే తెలంగాణలో గతంలో కరోనా పరీక్షల గురించి, ఇతర విషయాల గురించి పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లను విచారించిన హైకోర్టు గతంలో తెలంగాణ సర్కార్ పై సీరియస్ అయింది.
 
తాజాగా హైకోర్టు కరోనా పరీక్షల గురించి ప్రభుత్వంపై మరోసారి సీరియస్ అయింది. ఈరోజు రాష్ట్రంలో కరోనా పరిస్థితుల గురించి హైకోర్టు విచారణ జరిపింది. ‌ విచారణకు కోర్టు ఆదేశాల మేరకు సీఎస్ సోమేష్ కుమార్ హాజరయ్యారు. హైకోర్టు ఈ సందర్భంగా గతంలో ఇచ్చిన ఆదేశాలు ఏ ఒక్కటీ రాష్ట్రంలో అమలు కావడం లేదని పేర్కొంది. ప్రభుత్వానికి కరోనా విషయంలో ఎందుకింత నిర్లక్ష్యం అని ప్రశ్నించింది.        
 
తెలంగాణ చీఫ్‌ సెక్రటరీపై సీరియస్ అయిన హైకోర్టు కరోనా బాధితుల నుంచి రాష్ట్రంలోని ప్రైవేట్ ఆస్పత్రులు అధిక మొత్తంలో ఫీజులు వసూలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. సీఎస్ సోమేష్ కుమార్ నిబంధనలు అతిక్రమించిన 50 ఆస్పత్రులకు ఇప్పటివరకు నోటీసులు అందజేసామని తెలిపారు. రాష్ట్రంలో ఎక్కువ మొత్తం ఫీజులు వసూలు చేస్తున్న ఆస్పత్రుల లైసెన్స్ లను రద్దు చేశామని అన్నారు.
 
హైకోర్టు మిగిలిన ఆస్పత్రుల పరిస్థితి ఏమిటని సీఎస్ ను ప్రశ్నించింది. ప్రభుత్వం కరోనా పరీక్షలు, చికిత్స గురించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ప్రభుత్వం నివేదికలో ఈ నెల 3వ తేదీ నుంచి 42,000 సెకండరీ కాంటాక్ట్ లకు కరోనా నిర్ధారణ పరీక్షలు జరిపామని పేర్కొంది. హోటళ్లలో ఐసోలేషన్ పడకలను 857 నుంచి 2,995కు పెంచామని... బులిటెన్ లో గందరగోళం లేకుండా చర్యలు తీసుకున్నామని.... కరోనా మృతదేహాల కోసం 61 వాహనాలు ఉన్నాయని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: