హైదరాబాద్: విజయవాడలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తలపెట్టిన మహాధర్నా మరి కాసెపట్లో మొదలుకానున్నది. కుమ్మరిపాలెం సెంటర్లో బాబు మహాధర్నాచేయనున్నారు. దుర్గమ్మగుడి వద్ద ఫ్లైఓవర్ను నిర్మించాలంటూ బాబు చేపట్టే మహాధర్నాకు భారీగా టీడీపీ శ్రేణులు చేరుకుంటున్నాయి. బాబు మహాధర్నాకు పోటీగా విజయవాడ ఎంపీ లగడపాటి రాజగోపాల్ కూడా అవగాహన సదస్సు పేరిట మరో ఆందోళనకు దిగుతున్నారు. దీనితో విజయవాడలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చంద్రబాబు, రాజగోపాల్ రోడ్డు రాజకీయాల వల్ల ఎప్పుడేం జరుగుతుందో తెలియని పరిస్థితులు నెలకొన్నాయి. పొట్టిశ్రీరాములు విగ్రహం వద్ద లగడపాటి చేయదలచిన ఆందోళనకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. అయినప్పటికీ రాజగోపాల్ ఆందోళన చేసి తీరుతానంటున్నారు. దీనితో ముందస్తుగా విజయవాడలో భారీగా పోలీసులు బలగాలను మోహరింపచేశారు. బాబు ధర్నాకు పోటీ ధర్నాకు దిగుతున్న రాజగోపాల్ చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నిస్తున్నారు. దుర్గమ్మగుడి వద్ద రవాణ కష్టాలు తీరడం కోసమే తమ నేత చంద్రబాబు మహాధర్నా చేస్తుంటే...ఎంపీ రాజగోపాల్ కేవలం రాజకీయ ఉద్దేశపూర్వకంగానే పోటీ ధర్నాకు దిగుతున్నాడనీ టీడీపీ వర్గాలు మండిపడుతున్నాయి. ఎవరు ఎన్ని రకాలుగా అడ్డుపడినా తాము చేపట్టిన మహాధర్నాను చేసి తీరుతామనీ టీడీపీ శ్రేణులు అంటున్నాయి. మొత్తానికి బాబు, లగడపాటిల పోటీ ధర్నాలతో విజయవాడలో టెన్షన్...టెన్షనగా వుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: