అవును.. పత్రికలు పండుగ చేసుకుంటున్నాయి. కరోనా దెబ్బతో విలవిల్లాడిన దిన పత్రికలు ఇప్పుడు కాస్త కోలుకుంటున్నాయి. కరోనా వేళ పత్రికలతో కూడా కరోనా వస్తుందన్న భయం ఓవైపు.. పత్రికలను సరఫరా చేసే బోయ్‌లు ముందుకు రాక మరికొన్ని రోజులు.. అన్నీ సక్రమంగా ఉన్నా లాక్ డౌన్ కారణంగా అసలు అమ్మడానికి దుకాణాలే తెరుచుకోక మరికొన్ని రోజులు దిన పత్రికలు చాలా గడ్డు పరిస్థితిని ఎదుర్కొన్నాయి. అసలే దిన పత్రిక అంటే చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారం.. భారీగా సిబ్బంది.. వేతనాలు, న్యూస్ ప్రింట్ ఖర్చు.. అబ్బో.. అది చాలా పెద్ద వ్యవహారం.

అందుకే చాలా పత్రికలు కరోనా లాక్‌డౌన్ అమలైన కొన్ని రోజులకే సిబ్బందిపై వేటు వేసేశాయి. చాలా పత్రికలు ప్రింటింగ్ ఆపేసి కేవలం ఆన్ లైన్ ఎడిషన్లతో నడిపించేశాయి. మరికొన్ని పత్రికలు మాత్రం నామ్ కే వాస్తే తరహాలో ఓ పది పేజీలు ప్రచురించి మమ అనిపించాయి. చివరకు ఈనాడు వంటి పెద్ద పత్రిక కూడా లాకౌట్ ప్రకటించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఈనాడు కూడా జిల్లా ఎడిషన్లు ఎత్తేసి.. పేజీల సంఖ్య బాగా కుదించింది. మిగిలినవి ఆన్ లైన్‌ చూసుకోండని తన పాఠకులకు సలహా ఇచ్చేసింది.

ఇక ఆ తర్వాత కొన్ని రోజులకు లాక్ డౌన్ క్రమంగా ఎత్తేసినా.. అన్ని రంగాలూ గడ్డు పరిస్థితుల్లో ఉండి యాడ్స్ ఇచ్చేందుకు ముందుకు రానే లేదు. కానీ ఇప్పుడు క్రమంగా సీన్ మారుతోంది. లాక్‌ డౌన్‌ ఏదో నామ్‌ కే వాస్తేగా అమలవుతోంది. స్కూళ్లు, థియేటర్లు, కాలేజీలు తప్ప.. మిగిలిన అన్ని సర్వీసులు సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి. అందుకే అన్ని రంగాలు మళ్లీ కుదుటపడుతున్నాయి. అందుకే పత్రికలకు యాడ్స్ కూడా మళ్లీ సాధారణ స్థాయికి చేరుకుంటున్నాయి.

ఆ తేడా ఇప్పుడు దసరా ముందు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో రోజూ 10- 14 పేజీలతో సరిపెట్టే ఈనాడు.. పండుగ వేళ నిజంగానే పండుగ చేసుకుంటోంది. జాకెట్ యాడ్లు, ఫుల్ పేజీ యాడ్లతో కళకళలాడుతోంది. మళ్లీ చాలా రోజు తరవాత ఈనాడు పత్రిక 24 పేజీలు ప్రచురిస్తోంది. అందులో చాలా వరకూ యాడ్లకే కేటాయిస్తోంది. ఈనాడే కాదు మిగిలిన దినపత్రికలకూ ఇదే పరిస్థితి.. హమ్మాయ్య.. మొత్తానికి కరోనా చీకట్లు తొలగిపోతున్నాయి. నిజంగా ఇది జర్నలిస్టులకు, పత్రికాయజమానులకు శుభవార్తే. 

మరింత సమాచారం తెలుసుకోండి: