కరోనాను కట్టడి చేసేందుకు రష్యా తయారు చేసిన స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ హైదరాబాద్‌ చేరుకుంది. భారత్‌లో ఈ వ్యాక్సీన్‌ థర్డ్‌ ఫేజ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌ జరగబోతున్నాయి. దీనికి సంబంధించి రష్యాతో రెడ్డీ ల్యాబ్స్‌ ఒప్పందం చేసుకుంది. ఈ నెల 15 తర్వాత క్లినికల్‌ ట్రయల్స్‌ ప్రారంభం కానున్నాయి. ఈ వ్యాక్సీన్‌ను ఇప్పటికే రష్యాలో డాక్టర్లు, అత్యవసర విధుల్లో ఉన్న సిబ్బంది ఇచ్చారు. స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ను రష్యాకు చెందిన గమలేయా నేషనల్‌ రీసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎపిడెమియాలజీ అండ్‌ మైక్రోబయాలజీ అభివృద్ధి చేసింది.

కరోనా నివారణలో స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ ద్వారా మెరుగైన ఫలితాలు వచ్చినట్టు స్పష్టమైంది. కరోనా నివారణలో 92 శాతం ప్రభావవంతంగా పని చేసిందని ఈ వ్యాక్సీన్‌ను అభివృద్ధి చేసిన సంస్థతో పాటు రష్యా డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ తెలిపాయి. రష్యాలో నిర్వహించిన మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌కు సంబంధించిన తొలి మధ్యంతర నివేదిక ఆధారంగా ఈ విషయాన్ని ఆ సంస్థలు ధ్రువీకరించాయి. రష్యాలో 40 వేల మంది వలంటీర్లపై ఈ వ్యాక్సీన్‌ను పరీక్షించారు.  

గత ఆగస్టు 11న రష్యాలో స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ని రిజిస్టర్‌ చేశారు. అలాగే, స్పుత్నిక్‌ వి వ్యాక్సీన్‌ క్లినికల్‌ ట్రయల్స్‌పై RDIF , రష్యా సావరిన్‌ వెల్త్‌ ఫండ్‌లతో గత సెప్టెంబర్‌లో భారత్‌కు చెందిన డాక్టర్‌ రెడ్డీస్‌ ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో భారత్‌లో స్పుత్నిక్‌ వి క్లినికల్‌ ట్రయల్స్‌కు మార్గం సుగమమైంది. భారత నియంత్రణ సంస్థల అనుమతుల అనంతరం 10 కోట్ల డోసులను డాక్టర్‌ రెడ్డీస్‌కు RDIF సరఫరా చేయాల్సి ఉంటుంది.

మొత్తానికి ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభణ ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఎంతో మందిని ఆస్పత్రి పాలు చేసిన ఈ మహమ్మారి.. ఇప్పటికీ జనాన్ని పట్టి పీడిస్తోంది. వ్యాక్సిన్ ఎప్పుడు వస్తుందోనని ప్రపంచం అంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. అయితే రష్యా వ్యాక్సిన్ హైదరాబాద్ లో అడుగుపెట్టింది.





మరింత సమాచారం తెలుసుకోండి: