హోరాహోరీగా జరిగిన జంగమ్మెట్‌ డివిజన్‌ ఎన్నికలలో మజ్లీస్‌ పార్టీ మరోసారి ప్రత్యర్థులను చిత్తు చేసింది. గెలిచేంత బలం లేకపోయినప్పటికీ ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులుండడంతో మజ్లీస్‌ పార్టీకి విజయం సులభతరమయ్యింది. 46,211 ఓట్లున్న ఈ డివిజన్‌లో 53.03 శాతం పోలింగ్‌తో 24,835 ఓట్లు నమోదయ్యాయి. మొదటి నుంచి ముస్లిం మైనార్టీ ఓట్లపైనే నమ్మకం పెట్టుకున్న ఎంఐఎం పార్టీ ఆ ఓట్లు ఇతర పార్టీలకు పడకుండా జాగ్రత్త తీసుకుంది.

మొత్తం ఓట్లలో ఎంఐఎం పార్టీ అభ్యర్థి ఎం.ఎ.రహెమాన్‌ 10,629 ఓట్లు సాధించి రెండోసారి విజయబాపుట ఎగురవేశారు. మైనార్టీయేతర ఓట్లు అధికంగా ఉన్నప్పటికీ బీజేపీ, టీఆర్‌ఎస్‌ లాంటి పార్టీలు విజయాన్ని అందుకోలేక పోయాయి. బీజేపీ అభ్యర్థి కౌడీ మహేందర్‌ గతంలో ఓడిపోయిన అభ్యర్థి కావడంతో సానుభూతితో గెలుస్తాడని భావించినప్పటికీ 9046 ఓట్లు సాధించి గెలుపు ముగింట చతికిలపడ్డాడు.గెలుపు తనదేనంటూ భావించిన టీఆర్‌ఎస్‌ అభ్యర్థి కె.స్వరూప రాంసింగ్‌ కేవలం 3191 ఓట్లకే పరిమితమయ్యారు.

ఆ తర్వాతి స్థానాలలో కాంగ్రెస్‌ అభ్యర్థి ఎన్‌.ప్రమోద్‌ రెడ్డి–331, సీపీఎం అభ్యర్థి ఎ.కృష్ణా నాయక్‌–329, డబ్ల్యూపీఐ అభ్యర్థి సయ్యద్‌ జియాఉద్దీన్‌ తాహేర్‌–257, ఎంసీపీఐ అభ్యర్థి జి.హరినాథ్‌ గౌడ్‌ 19 ఓట్లు మాత్రమే సాధించారు. 12 పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లు నమోదయ్యాయి. మొత్తం మీద ఏ పార్టీకి ఆ పార్టీ గెలుపు కోసం ప్రయత్నించడంతో భారీగా ఓట్లు చీలి మరోసారి జంగమ్మెట్‌ను ఎంఐఎం దక్కించుకుంది.

జీహెచ్‌ఎంసీ పరిధిలోనే అత్యధికంగా బరిలోకి దిగిన 13 మంది స్వతంత్ర అభ్యర్థులు ఈ డివిజన్‌లో పెద్ద ఎత్తున ఓట్లు తీసుకున్నారు. మొత్తం 20 మంది అభ్యర్థులు కలిసి 227 ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థులలో వి.గోపి–5, ఎస్‌.చంద్రప్రకాష్‌–23, కె.జగన్‌–21, జినుకుంట మాధవరావు–40, చంద్రశేఖర్‌–24, మహ్మద్‌ రియాజ్‌–58, మెట్టు శ్రీనివాస్‌–11, రజనీకాంత్‌–0, రంగాచారి–8, వెంకటేష్‌–3, భాస్కర్‌–6, శ్రీశైలం–7, సురేందర్‌–21ల చొప్పున ఓట్లు సాధించారు. వీటితో పాటు 66 నోటా ఓట్లు, 756 ఓట్లు చెల్లనవిగా గుర్తించారు.

జంగమ్మెట్‌ డివిజన్‌లో బీజేపీ, ఎంఐఎంల నడుమ హోరాహోరీ నెలకొని ఉండడం. చెల్లని ఓట్లు పెద్ద ఎత్తున ఉండడంతో పార్టీలు గొడవలకు దిగడంతో ఫలితం చాలా ఆలస్యమయ్యింది. బ్యాలెట్‌ పేపర్లపై కొందరు అవగాహన రాహిత్యంతో ఇంకుతో వేలిముద్ర పెట్టడం. రెండు మూడు గుర్తులపై పెట్టడం. ఒక పార్టీ బాక్స్‌ దాటి మరో బాక్స్‌లోకి సగం మేర పెట్టడం వాటితో ఈ సమస్య నెలకొంది. మొదటి రౌండ్‌లో 571 ఓట్ల ఆధిక్యంలో ఉన్న బీజేపీ రెండో రౌండ్‌ వచ్చే సరికి 1583 ఓట్ల తేడాతో ఓటమి పాలయ్యింది. రాత్రి 10 గంటలకు తుది ఫలితం వెలువడింది.

మరింత సమాచారం తెలుసుకోండి: