ఎన్నికల ముందు పురుడు పోసుకున్న జనసేన పార్టీ.. రాష్ట్ర రాజకీయాల్లో పెను సంచలనం కాకపోయినా.. విపరీతంగా చర్చనీయాంశమయ్యింది. బీజేపీ, టీడీపీలకు తోక పార్టీలా మారిందని విమర్శలు ముటగట్టుకున్నా.. విభజనతో కడుపుమండిన సీమాంధ్రుల ఆవేదనను పవన్ కల్యాణ్ బహిరంగసభల్లో వినిపించడం ద్వారా ఆకట్టుకున్నాడు. అత్యంత కీలకమైన ప్రచారం చివరి రోజుల్లో.. ఆటను మలుపుతిప్పాడు. మోడీ మానియాకు.. చంద్రబాబు చాణక్యానికి.. పవర్ స్టార్ పంచ్ డైలాగులు కూడా తోడై.. బీజేపీ-టీడీపీ కూటమికి విజయం నల్లేరుపై నడకే అయ్యింది. పవన్ ఆవేశపూరితమైన ప్రసంగాలు.. ప్రత్యేకించి వైకాపా అధ్యక్షుడు జగన్ పై విసిరిన వ్యంగ్యాస్త్రాలు బాగా పేలాయి.
ప్రశ్నింస్తానంటూ.. రాజకీయ యవనికపైకి శరవేగంగా దూసుకొచ్చిన జనసేన పార్టీ.. ఎన్నికల తర్వాత ఎక్కడా కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. పవన్ కల్యాణ్ కేవలం మోడీ, చంద్రబాబుల విజయం కోసం తాత్కాలిక ఒప్పందాల మేరకే పనిచేశారని విమర్శలూ వచ్చాయి. నేరుగా పార్టీలో చేరిపోతే ప్రత్యేకత ఉండదు కాబట్టి.. హైప్ క్రియేట్ చేయడానికే పవన్ సొంత పార్టీ పెట్టారని.. అది కేవలం ఎన్నికల కోసం పెట్టిందేనని పవన్ వ్యతిరేకులు ప్రచారం చేశారు. మరికొందరు కేవలం అన్న చిరంజీవితో వచ్చిన విభేదాల కారణంగానే పవన్ పార్టీ పెట్టారని.. కాంగ్రెస్ ఓటమే ధ్యేయంగా పనిచేశారని విశ్లేషించారు.
ఏదేమైనా.. ఎన్నికల స్తబ్దుగా ఉన్న జనసేన.. మళ్లీ ఓ ప్రెస్ నోట్ ద్వారా వార్తల్లోకి వచ్చింది. ఫేస్‌బుక్, ట్విటర్ వంటి సోషల్ మీడియాలో జనసేన పార్టీ గురించి గానీ, పార్టీ తరపున ప్రకటనలు అంటు వస్తే అటువంటి వాటితో తమకు సంబంధం లేదని జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అందులో స్పష్టంచేశారు. పార్టీ పేరుతో ఈ సోషల్ నెట్‌వర్క్‌లో గానీ ఇతర మార్గాల ద్వారా గాని విరాళాలు అభ్యర్థిస్తే తమకు ఎలాంటి సంబంధంలేదన్నారు.
విమర్శలు ఎన్ని వస్తున్నా.. పవన్ మౌనంగా తన పని తాను కాసిస్తున్నట్టు తెలుస్తోంది. వ్యూహాత్మకంగా పావులు కదుపుతూ.. పార్టీని క్రీయాశీలకంగా ఉంచాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే జనంలోకి వెళ్లాలని ఆయన ఆలోచిస్తున్నట్టు తెలుస్తోంది. పార్టీకి ఇంకా కేంద్ర ఎన్నికల కమిషన్ నుంచి గుర్తింపు రాకపోవడంతో పవన్ మౌనం వహిస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు పేర్కొంటున్నాయి. పార్టీని క్రీయశీలకంగా తయారు చేసి రెండు రాష్ట్రాలలో బలోపేతం చేయాలని పవన్ పథకాలు రచిస్తున్నట్టు తెలుస్తోంది.
మరింత సమాచారం తెలుసుకోండి: