కరోనా టీకా.. ఇప్పుడు ప్రపంచమంతా దీని గురించే మాట్లాడుకుంటోంది. ఇక ఇండియాలో అయితే కరోనా టీకా అందుబాటులోకి వచ్చేసింది. నిన్న ప్రపంచంలోనే అతి పెద్ద వ్యాక్సీన్ ప్రక్రియ ఇండియాలో మొదలైంది. అయితే ఇప్పటికే వ్యాక్సీన్ తీసుకుంటున్న దేశాల్లో అక్కడక్కడా అపశ్రుతులు చోటుచేసుకుంటున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వ్యాక్సీన్ ప్రక్రియ అమలవుతున్న నార్వే దేశంలో కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకున్న వారిలో 23 మంది వృద్ధులు మరణించడం కలకలం రేపుతోంది.

ఈ దేశంలో ఫైజర్‌ ఎన్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన కోవిడ్‌ వ్యాక్సిన్‌ ఇస్తున్నారు. అందులో భాగంగా ముందుగా వయోవృద్ధులకు ఈ టీకా ఇచ్చారు. అలా తీసుకున్న వారిలో ఫస్ట్‌ డోసు తీసుకున్న  23 మంది వృద్ధులు మరణించారు. టీకా తీసుకున్న తర్వాత వచ్చే సాధారణమైన దుష్ర్పభావాలు తలెత్తి.. అవి తీవ్రంగా మారి మరణించారని నార్వేజియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ విశ్లేషించింది. వ్యాక్సిన్‌ తీసుకున్న తర్వాత కనిపించే సాధారణ సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా బాగా బలహీనంగా ఉన్న వారిలో తీవ్రంగా మారాయని తెలిపింది.

ఈ పరిణామంతో బాగా ముసలివారు, అనారోగ్య సమస్యలు ఉన్నవారు వ్యాక్సిన్‌ తీసుకోవద్దని నార్వే ప్రభుత్వం సూచించింది. ఇప్పటికే బాగా ముసలితనం వచ్చేసిన వారు ఈ టీకా తీసుకోవడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండ‌ద‌ని చెబుతున్నారు. అందుకే ఆరోగ్యవంతులు, యువ‌కులు టీకాను తీసుకోవ‌చ్చు అని నార్వే ప్రభుత్వం చెబుతోంది. ఇలా 23 మంది చనిపోయిన ఘటనపై టీకా తయారీ కంపెనీ ఫైజర్ కూడా స్పందించింది. ఈ ఘటనపై ఫైజ‌ర్ కంపెనీ విచార‌ణ చేప‌డుతోంది.

అయితే ఈ వార్త చదివి టీకా గురించి భయపడాల్సిందేమీ లేదు. వయోవృద్ధులకు శరీరంలో మార్పులను తట్టుకునే శక్తి కాస్త తక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే. అయితే ఇండియాలో నిన్న పెద్ద సంఖ్యలో టీకా ఇచ్చినా ఎక్కడా చెప్పుకోదగిన దుష్పలితాలు కనిపించలేదు.  మన టీకాలు సురక్షితం అని చెప్పేందుకు ఇదే ఓ ఉదాహరణగా చెప్పుకోవచ్చేమో.


మరింత సమాచారం తెలుసుకోండి: