తిరుపతి: వైసీపీ ఫైర్ బ్రాండ్, నగరి ఎమ్మెల్యే రోజా కన్నీరు పెట్టుకున్నారు. తనకు పార్టీ నేతలు ప్రాధాన్యం ఇవ్వడం లేదని వాపోయారు. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ప్రొటో కాల్ ప్రకారం తనకు ప్రాధాన్యత దక్కడం లేదని, తమ పార్టీ నేతలు తనను గౌరవించడం లేదని రోజా ఆరోపించారు. ఈ మాటలు చెప్తూ శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ఎదుట బోరున విలపించారు. టీటీడీలో కూడా ఇదే పరిస్థితి ఉందని ఫిర్యాదు చేశారు. ఎన్ని కమిటీలు వచ్చినా, ఎంత మందికి చెప్పుకున్నా.. పట్టించుకోవడం లేదని, ఎలాంటి ప్రయోజనం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే రోజా కన్నీటి వెనక అధికార పార్టీ నేతలు ఉన్నారని, వారి వల్లే ఆమె ఇలా రోదిస్తున్నారని సమాచారం. పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాల వల్లే ఆమె బాధపడుతోందని, ఇవే ఆమె ఆవేదనకు కారణమని రాజకీయ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అయితే పార్టీ గ్రూపు రాజకీయాల గురించి ఆమె మాట్లాడలేదు. కేవలం తనను ప్రొటోకాల్ ప్రకారం అధికార కార్యక్రమాలకు పిలవడం లేదనే ఆవేదనతోనే ప్రివిలైజ్ కమిటీ ముందుకు వెళ్లారట. ఇదే ఆమె బాధపడటానికి అసలు కారణం అని తెలుస్తోంది. ఇటీవల రోజా సొంత నియోజకవర్గం నగరిలో ఇళ్ల పంపిణీ కార్యక్రమం జరిగింది.

అయితే ఈ కార్యక్రమం గురించి రోజాకు ఎలాంటి సమాచారం అందించలేదట. దీంతో ఆమె చాలా నొచ్చుకుంది. చివరకు శాసనసభ ప్రివిలైజ్ కమిటీ ముందుకొచ్చి తన పరిస్థితిపై ఫిర్యాదు చేసింది. ఆ ఫిర్యాదులో భాగంగా తిరుపతిలో ఇవాళ విచారణకు హాజరయ్యారు. గతంలో కూడా ఇలా పలుమార్లు జరిగిందని ఆమె కమిటీ ముందు తన ఆవేదన బయట పెట్టుకున్నారు.  సొంత పార్టీ అధికారంలో ఉండగా... తనకు దక్కాల్సిన గౌరవం దక్కడం లేదని.. సరైన ప్రాధాన్యత ఇవ్వడం లేదని అధికారులకు వివరించారు. శాసన సభ సభ్యురాలిగా ఉన్న తనకు ప్రొటోకాల్ ప్రకారం రావాల్సిన గౌరవం దక్కాలని, ఈ విషయంలో అన్నీ సవ్యంగా జరిగేలా చూడాలని కమిటీని కోరారు.

మరింత సమాచారం తెలుసుకోండి: