అలనాటి స్టార్ హీరోయిన్, అందం–అభినయాల మేళవింపు అయిన శ్రియ శరణ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. ఇండస్ట్రీకి వచ్చి కొద్ది కాలంలోనే ఆమె అసాధారణమైన క్రేజ్‌ సంపాదించి స్టార్‌డమ్‌ను అందుకుంది. దాదాపు సగం టాలీవుడ్ స్టార్ హీరోల సరసన నటిస్తూ వరుసగా హిట్ ఫిల్మ్‌లు ఇచ్చింది. కెరీర్ పీక్స్‌లో ఉన్నప్పుడే ఆమె పెళ్లి చేసుకోవడం అప్పట్లో పెద్ద చర్చగా మారింది. ప్రస్తుతం శ్రియ ఒక అందమైన పాపకు తల్లిగా ఫ్యామిలీతో హ్యాపీ లైఫ్‌ని ఎంజాయ్ చేస్తోంది. ఇటీవల తేజ సజ్జా నటించిన ‘మిరాయ్’ అనే పాన్ ఇండియా చిత్రంతో మళ్లీ రీఎంట్రీ ఇచ్చి, అందులో హీరో తల్లిగా కనిపించి నటనతో అందరిని ఆకట్టుకుంది. ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే శ్రియ, కుటుంబంతో ఉన్న హాలిడే ఫొటోలు, ఫ్యాషన్ పోస్టులు, వర్క్ అప్‌డేట్స్‌ని షేర్ చేస్తూ అభిమానులకు మరింత దగ్గరవుతూ ఉంటుంది.


అయితే తాజాగా ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఓ పోస్ట్ మాత్రం సోషల్ మీడియాలో పెద్ద సంచలనంగా మారింది. కారణం… ఓ అజ్ఞాత వ్యక్తి శ్రియ శరణ్‌ డిస్‌ప్లే ఫోటోతో కలిసి ఒక నకిలీ మొబైల్ నెంబర్‌ను సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశాడు. దీనిని చూసి ఆశ్చర్యపోయిన శ్రియ స్వయంగా ఆ స్క్రీన్‌షాట్‌ని షేర్ చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆ పోస్ట్‌లో శ్రియ ఇలా రాసుకొచ్చింది..“అసలు ఈ మూర్ఖుడు ఎవరు? దయచేసి ప్రజల సమయాన్ని వృథా చేసే ఇలాంటి పనులు చేయడం ఆపండి. ఇది నా నెంబర్ కాదు! నేను కాదు! ఇంకా ఆశ్చర్యమేమిటంటే… ఈ చెత్త వ్యక్తి నేను ఆరాధించే, పని చేయడానికి ఇష్టపడే వ్యక్తులను కూడా సంప్రదించడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది నాకు చాలా విచిత్రంగా, బాధగా ఉంది. మీ విలువైన సమయాన్ని ఇలా వృథా చేసుకోకుండా, మీ జీవితాన్ని మంచిగా మార్చుకునేందుకు కృషి చేయండి.”



శ్రియ‌ చేసిన ఈ సీరియస్ పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో పెద్ద వైరల్‌గా మారింది. అభిమానులు, నెటిజన్లు ఆమెకి సపోర్ట్ చేస్తూ: “మేడం వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి”..“ఇలాంటి ఫ్రాడ్‌లను కఠినంగా శిక్షించాలి”..“సెలెబ్రిటీలను ఇలా టార్గెట్ చేసే వ్యక్తులపై చర్య తీసుకోవాలి” అంటూ వరుసగా కామెంట్స్ చేస్తున్నారు. కొంతమంది నెటిజన్లు అయితే, ఈ పని చేసిన వ్యక్తి వ్యవహారాన్ని తీవ్రంగా మండిపడుతున్నారు. సెలెబ్రిటీలను ఇంపర్సనేట్ చేయడం, నకిలీ నంబర్లు షేర్ చేయడం లాంటి చర్యలు చట్టపరంగా కూడా తీవ్రమైన నేరమే అని న్యాయవేత్తలు చెబుతున్నారు. మొత్తానికి, శ్రియ శరణ్ నంబర్ లీక్ అని చెప్పుకుని సోషల్ మీడియాలో ఏదో వ్యక్తి చేసిన ఈ అల్లరి ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీసింది. అభిమానులు మాత్రం శ్రియ సేఫ్టీ కోసం వెంటనే లీగల్ యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: