చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ అన్ని మెట్రో నగరాలలో కనీసం ఒక్కటి కాదు, రెండు మూడు ఐమాక్స్ స్క్రీన్లు ఉంటాయి. అక్కడ సాధారణ ప్రేక్షకులు కూడా హాలీవుడ్ సినిమాలు ఐమాక్స్ లోనే చూసేందుకు ఆసక్తి చూపుతారు. కానీ హైదరాబాద్ లాంటి పెద్ద మార్కెట్‌లో మాత్రం ఐమాక్స్ లేదు. గతంలో ప్రసాద్ ఐమాక్స్ తెచ్చారు, అది సౌత్ ఇండియా అంతటా హంగామా చేసింది. అయితే ఆ గడువు ముగిసిన తర్వాత, ప్రస్తుతం అది పీసీఎక్స్ స్క్రీన్‌గా మాత్రమే కొనసాగుతోంది... ఐమాక్స్ ఫార్మాట్ లేదు. ఇప్పుడు ఏషియన్ సినిమాస్ ఐమాక్స్ తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారన్న వార్తలు వస్తున్నాయి. ఇంత భారీ మార్కెట్ ఉన్నా తెలుగు రాష్ట్రాల్లో ఐమాక్స్ పని చేయకపోవడానికి కారణం ఏమిటి ? అంటే రకరకాల ప్రశ్నలు కూడా తెరమీదకు వస్తున్నాయి.
ఇండస్ట్రీ వర్గాల సమాధానం సింపుల్ ఐమాక్స్ స్క్రీన్లకు సాధారణంగా టికెట్లు రు. 700 - 1200 వరకు ఫిక్స్ చేస్తారు. సినిమా డిమాండ్‌ను బట్టి ఇంకా పెరగచ్చు కూడా. కానీ ఏపీ, తెలంగాణల్లో మాత్రం గరిష్ట టికెట్ రేట్‌కు కఠినమైన పరిమితి ఉంది. కొత్త సినిమాలకు రేట్లు పెంచాలంటే ప్రత్యేకంగా జీవో తెప్పించాలి, థియేటర్లు తమంతట తాముగా రేట్లు పెంచుకునే పరిస్థితి లేదు. ఐమాక్స్ లాంటి హై - టెక్ స్క్రీన్ ఏర్పాటు చేసేందుకు చాలా ఖర్చు అవుతుంది. రికవరీ అవ్వాలంటే టికెట్ ధరలు ఫ్లెక్సిబుల్‌గా ఉండాలి. కానీ ఇక్కడ ఆ అవకాశం లేకపోవడం వల్లే పెద్ద పెద్ద కంపెనీలు వెనక్కి తగ్గుతున్నారని తెలుస్తోంది. ఐమాక్స్ తెచ్చే ప్రయత్నం మళ్లీ మొదలైనా, ప్రైస్ ఫ్లెక్సిబిలిటీపై ప్రత్యేక అనుమతులు ఇవ్వకపోతే అది వ్యాపారపరంగా కష్టమే. అయితే ప్రేక్షకుల్లో ఐమాక్స్ కోసం ఉన్న క్రేజ్ చూసి భావి రోజుల్లో ప్రభుత్వాలు సడలింపులు ఇస్తాయేమో చూడాలి. ఇప్పటివరకు ఐమాక్స్ లేకపోవడం నిజంగా తెలుగు సినీ ప్రేమికులకి పెద్ద లోటే అన్నది మాత్రం ఖాయం.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి