సినిమా పైరసీ అనేది చిత్ర పరిశ్రమను పట్టి పీడిస్తున్న సమస్య అని అందరికీ తెలిసిందే. అయితే, ఇటీవల ఐబొమ్మ వెబ్‌సైట్ ద్వారా పైరసీకి పాల్పడిన ఇమంది రవి అరెస్ట్ తర్వాత చోటుచేసుకుంటున్న పరిణామాలు మాత్రం ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయి. పైరసీ వెబ్‌సైట్ల ద్వారా కోట్లు గడించారన్న ఆరోపణలతో రవిని పోలీసులు అదుపులోకి తీసుకుంటే, బయట మాత్రం అతనికి విపరీతమైన మద్దతు లభిస్తోంది. సాధారణంగా ఒక నేరంలో పట్టుబడిన వ్యక్తి పట్ల సమాజంలో వ్యతిరేకత ఉంటుంది, కానీ ఇక్కడ పరిస్థితి పూర్తిగా భిన్నంగా ఉండటం సామాన్య ప్రజలను సైతం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సోషల్ మీడియా వేదికగా రవికి మద్దతుగా వస్తున్న పోస్టులు, కామెంట్లు చూస్తుంటే ఒక వర్గం ప్రేక్షకులు అతన్ని ఏ స్థాయికి చేర్చారో స్పష్టమవుతుంది.

ముఖ్యంగా రవిని 'ఠాగూర్' సినిమాలోని పాత్రతో పోలుస్తుండటం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అవినీతిని అంతం చేయడానికి ఆ సినిమాలో హీరో ఎలాగైతే సొంత చట్టాన్ని అమలు చేశాడో, సామాన్యుడి వినోదానికి అడ్డుగా ఉన్న అధిక ధరలను దాటడానికి రవి ఈ మార్గాన్ని ఎంచుకున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. చట్టం దృష్టిలో అతను నేరస్థుడే అయినా, తమ జేబులకు చిల్లులు పడకుండా కాపాడిన వ్యక్తిగా కొందరు అతన్ని కీర్తిస్తున్నారు. ఈ విపరీత ధోరణి వెనుక కేవలం ఒక వ్యక్తిపై అభిమానం మాత్రమే లేదు, ప్రస్తుత సినిమా వ్యవస్థపై ప్రజల్లో గూడుకట్టుకున్న అసహనం, ఆగ్రహం కూడా బలంగా కనిపిస్తోంది.

ఈ అనూహ్య మద్దతుకు ప్రధాన కారణం నిర్మాతల అత్యాశ, ఆకాశాన్నంటుతున్న టికెట్ ధరలేనని సోషల్ మీడియాలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ఒకప్పుడు సామాన్యుడికి అందుబాటులో ఉండే వినోదం, నేడు భారీ ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. థియేటర్‌కు వెళ్తే టికెట్ రేట్ల మోత ఒకెత్తయితే, అక్కడ అమ్మే స్నాక్స్, పాప్‌కార్న్ ధరలు సామాన్యుడి నడ్డి విరుస్తున్నాయి. నాలుగురు ఉన్న ఒక మధ్యతరగతి కుటుంబం సినిమాకు వెళ్లాలంటే వేలల్లో ఖర్చు చేయాల్సి వస్తోంది. పోనీ ఇంట్లో కూర్చుని చూద్దామంటే, ఒక్కో సినిమా ఒక్కో ఓటీటీలో ఉండటం, వాటన్నింటికీ వేర్వేరుగా సబ్స్క్రిప్షన్లు కట్టడం తలకు మించిన భారంగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో రూపాయి ఖర్చు లేకుండా అరచేతిలో వినోదాన్ని పంచిన రవి, వారికి ఒక రక్షకుడిలా కనిపించడంలో ఆశ్చర్యం లేదని విశ్లేషకులు అంటున్నారు. పరిశ్రమ ఎంత గగ్గోలు పెట్టినా, తమ ఆర్థిక భారాన్ని తగ్గించిన వ్యక్తిగానే జనం రవిని చూస్తుండటం గమనార్హం.


మరింత సమాచారం తెలుసుకోండి: