ఇటీవల జరిగిన పరిణామాల్లో హిందూపురం నియోజకవర్గ ఇంచార్జ్ దీపిక వ్యవహారశైలి పెద్ద చర్చకు దారి తీసింది. పార్టీ నాయకులను కలుపుకుని ముందుకు సాగాల్సిన సమయంలో, ఆమె పూర్తిగా సొంత నిర్ణయాలతో, సొంత కేడర్‌ను ఏర్పరుచుకోవడంపై ఎక్కువ దృష్టి పెట్టిందనేది స్థానిక నేతల ఆరోపణ. అంతేకాదు, వైసీపీ చెప్పిన మేరకు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన ఆందోళనకు కూడా ఆమె ఇతర నాయకులను ఆహ్వానించలేదట. దీంతో పార్టీ అంతర్గతంగా అసంతృప్తి మరింత పెరిగింది. ఈ నేపథ్యంలో అసహనానికి గురైన దీపిక భర్త వేణు చేసిన వ్యాఖ్యలు వివాదాన్ని మరింత భగ్గుమన్నాయి. ఆయన వ్యాఖ్యలు నేరుగా టీడీపీపైకి వెళ్లడంతో ఆ పార్టీ కార్యకర్తలు తీవ్ర స్థాయిలో స్పందించారు. దీనివల్ల వైసీపీ ఆఫీసుపై దాడులు కూడా జరిగాయి.
ఈ వ్యవహారంపై టీడీపీ ఎలా స్పందించినా, వైసీపీ నేతలు మాత్రం బాధ్యత పూర్తిగా దీపికపైనే ఉందని వాదిస్తున్నారు. ఆమె నిర్ణయాలు పార్టీకి నష్టం కలిగిస్తున్నాయని, స్థానిక నాయకుల అనుమతి లేకుండా తన కేడర్‌ను పెంచుకోవడం వల్ల తమకూ, పార్టీ ప్రతిష్టకూ భంగం కలుగుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. హిందూపురం ప్రాంతంలో బాలకృష్ణకు ఉన్న అభిమానుల్లో చాలామంది వైసీపీకి కూడా సానుభూతి చూపేవారని స్థానికులు చెబుతున్నారు. ఇప్పుడు వేణు చేసిన వ్యాఖ్యల వల్ల ఆ సానుభూతి పూర్తిగా కోల్పోయే ప్రమాదం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది. రాజకీయాల్లో ప్రత్యేకించి ప్రతిష్టాత్మక నాయకులున్న ప్రాంతాల్లో మరింత అప్రమత్తంగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని నవీన్ నిశ్చల్ వర్గం చెబుతోంది.
గతంలో బాలయ్యపై పోటీ చేసి ఓడిపోయినప్పటికీ, ఆయన అభిమానులను బాధించేలా ప్రవర్తించలేదని నవీన్‌ను ఉదాహరణగా చూపుతున్నారు. ప్రస్తుతం ఏర్పడిన పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు, పార్టీ అధిష్టానం తక్షణమే జోక్యం చేసుకుని, మరో పెద్ద నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని వైసీపీ నాయకులు కోరుతున్నారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి