దక్షిణాదిన కాషాయ జెండా ఎగరేయాలని ఉవ్విళ్లూరుతున్న భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాలపై ఫోకస్ పెట్టింది. తెలంగాణలో ఇప్పటికే కేసీఆర్ ని వణికిస్తోంది. టీఆర్ఎస్ ని రెండు వరుస ఎన్నికల్లో చావుదెబ్బ కొట్టింది. దుబ్బాకలో విజయంతో ఊపుమీదున్న బీజేపీ.. అదే ఉత్సాహంతో గ్రేటర్ లో ఊహించని స్థాయిలో సీట్లు సంపాదించింది. అదే జోరు ఏపీలో కూడా చూపించాలనుకుంటోంది బీజేపీ. తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నికలపై జనసేనతో కలసి పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టింది.

తిరుపతి వైసీపీ ఎంపీ బల్లి దుర్గాప్రసాదరావు మరణంతో వస్తున్న ఉప ఎన్నికలకు బీజేపీ, జనసేన సమాయత్తం అవుతున్నాయి. పొత్తులపై చర్చలు సుదీర్ఘంగా సాగుతున్నాయి. ఏ  పార్టీ తరపున అభ్యర్థి బరిలో దిగినా.. రెండు పార్టీలు సంయమనంతో పనిచేయాలని, కచ్చితంగా విజయం సాధించాలని అంటున్నారు నేతలు. ఆమేరకు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. ఈ పాటికే పలు దఫాలు బీజేపీ తిరుపతి కేంద్రంగా సమావేశాలు, సమీక్షలు ఏర్పాటు చేసింది. జనసేనాని పవన్ కల్యాణ్ కూడా తిరుపతి పరిధిలో రైతుల పరామర్శ యాత్ర చేసి వచ్చారు. గురువారం మరోసారి ఆయన తిరుపతి కేంద్రంగా సమీక్ష నిర్వహించబోతున్నారు.


తిరుపతి ఉప ఎన్నికలకోసం ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించింది, అధికార పార్టీ కూడా చూచాయగా అభ్యర్థిని ఖరారు చేసినా అధికారికంగా పేరు ప్రకటించలేదంతే. ఇకతేల్చాల్సింది బీజేపీ, జనసేనే. అయితే అభ్యర్థి విషయంలో తొందరపడకుండా.. సావధానంగా నిర్ణయం తీసుకోవాలని రెండు పార్టీలు భావిస్తున్నాయి. గెలుపే లక్ష్యంగా కృషిచేస్తున్నాయి. ఏపీలో ప్రభుత్వ పథకాల అమలు తీరుపై విమర్శలు చేస్తూ, అటు ప్రతిపక్షం పూర్తిగా విఫలమైందనే అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని చూస్తున్నారు నేతలు. నవరత్నాలతో అసలైన లబ్ధిదారులకు న్యాయం జరగలేదనేది బీజేపీ-జనసేన వాదన. రాష్ట్రంలో నిత్యావసరలా ధరలు భారీగా పెరిగిపోయాయని, పేదలకు ఇస్తున్న ఆర్థిక సాయాన్ని.. మరో రూపంలో వెనక్కి లాగేసుకుంటున్నారనే విషయాన్ని జనంలోకి తీసుకెళ్లబోతున్నారు. వైసీపీకి, టీడీపీకి ఝలక్ ఇస్తూ.. తిరుపతిలో బీజేపీ-జనసేన జెండా ఎగరేయాలనేదే రెండు పార్టీల పట్టుదల. తిరుపతి ఉప ఎన్నికల్లో సంచలనం నమోదవుతుందా, మరో దుబ్బాకలాగా బీజేపీకి కలిసొస్తుందా.. వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: