సాధారణంగా పెళ్లి అనగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేవి కొత్త బట్టలు, కళ్యాణ మండపం, భోజన ఏర్పాట్లు, బంధుమిత్రుల హడావుడి వంటి అనేక విషయాలు. కానీ వీటన్నింటికన్నా ముందుగా చాలా మందికి మొదట గుర్తుకు వచ్చేది ఒక్కటే – బంగారం. ముఖ్యంగా ఆడపిల్ల పెళ్లి అంటే ఎంత బంగారం పెడుతున్నారు, ఎన్ని తులాలు ఇస్తున్నారు, తాళిబొట్టు ఎంత గ్రాములు అని అడగడం మన సమాజంలో సహజంగా మారిపోయింది. పెళ్లి ఒక పవిత్ర బంధం అనే భావన కన్నా, బంగారం ఎంత ఇచ్చారు అన్న ప్రశ్నే ఎక్కువగా వినిపించే పరిస్థితి ఉంది.

కానీ ప్రస్తుతం పరిస్థితులు పూర్తిగా మారుతున్నాయి. బంగారం ధర రోజురోజుకూ ఆకాశాన్ని తాకుతోంది. ఒకప్పుడు గ్రాము బంగారం ధర కొన్ని వందల్లో, తర్వాత వేలల్లో ఉండేది. ఇప్పుడు ఏకంగా గ్రాము ధర 16,000 రూపాయలు దాటేసింది. ఇది మధ్యతరగతి కుటుంబాలకు మాత్రమే కాదు, సాధారణంగా ప్రతి కుటుంబానికీ తీవ్ర ఆర్థిక ఒత్తిడిని తీసుకొస్తోంది. ఒక తాళిబొట్టు చేయించాలంటే కనీసం రెండు నుంచి మూడు గ్రాములు అవసరం అవుతాయి. అంటే కేవలం తాళిబొట్టుకే లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సిన పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఒక మధ్యతరగతి కుటుంబం అంత డబ్బును కేవలం బంగారం కోసమే వెచ్చించగలదా అనే ప్రశ్నకు చాలా మంది ‘కాదు’ అనే సమాధానమే చెబుతున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లోనే సమాజంలో కొత్త ఆలోచనలు, కొత్త ట్రెండ్లు మొదలవుతున్నాయి. ‘పెళ్లి అంటే ఇకపై బంగారం తప్పనిసరి కాదు’ అనే మాటలు వినిపిస్తున్నాయి. అసలు పెళ్లి అనగానే బంగారం కాదు, సంప్రదాయాలు గుర్తుకు రావాలి అనే అభిప్రాయం బలపడుతోంది. పూర్వకాలంలో పెళ్లి సమయంలో బంగారు తాళిబొట్టు కాకుండా పసుపు తాడును మెడలో కట్టే సంప్రదాయం ఉండేదని పెద్దలు గుర్తు చేస్తున్నారు. ఒక పసుపు కొమ్మును పవిత్రంగా భావించి, దానిని మెడలో కట్టడం ద్వారా దాంపత్య జీవనానికి శ్రీకారం చుట్టేవారు. ఆ రోజుల్లో బంగారం ప్రదర్శన కాదు, బంధం పవిత్రతకే ఎక్కువ ప్రాధాన్యం ఉండేది.ఈ రోజు బంగారం ధరలు ఈ స్థాయిలో పెరిగిపోతున్న తరుణంలో, భవిష్యత్తులో మళ్లీ అలాంటి సంప్రదాయాల వైపు మనం వెళ్లాల్సి వస్తుందేమో అనే చర్చలు జరుగుతున్నాయి. పెళ్లి అనేది ఆడంబరాలకు, ఖర్చులకు ప్రతీకగా కాకుండా, రెండు మనసుల కలయికగా, కుటుంబాల ఐక్యతగా ఉండాలనే ఆలోచన చాలామందిలో మొదలవుతోంది.

ఇక మరో ముఖ్యమైన అంశం కట్నం మరియు కానుకలు. ఆడపిల్లలకు పెళ్లి చేయాలంటే తప్పనిసరిగా బంగారం ఇవ్వాలి అనే భావన ఇప్పటికీ చాలామందిలో ఉంది. కానీ ఈ భావన వల్ల తల్లిదండ్రులు అప్పుల పాలవడం, ఆర్థికంగా కుంగిపోవడం వంటి సమస్యలు పెరుగుతున్నాయి. అందుకే బంగారం కాకుండా వేరే ప్రత్యామ్నాయాలను ఆలోచించాలనే సూచనలు వస్తున్నాయి. ఉదాహరణకు, బంగారం స్థానంలో కొంత డబ్బు, లేదా భవిష్యత్తుకు ఉపయోగపడే స్థలాలు, పెట్టుబడులు ఇవ్వడం బెటర్ అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇవి ఆడపిల్ల జీవితానికి నిజంగా ఉపయోగపడతాయని చాలామంది భావిస్తున్నారు.

కొంతమంది అయితే పెళ్లి కాన్సెప్ట్ నుంచే బంగారాన్ని పూర్తిగా తప్పించేయడం మంచిదని అంటున్నారు. బంగారం ధరలు ఇలా పెరుగుతూనే ఉంటే, ఎంత డబ్బున్నవారైనా సరే ఎప్పటికప్పుడు కొనడం కష్టం అవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పుడే గ్రాము ధర 16,000 రూపాయలు దాటితే, రాబోయే రోజుల్లో అది ఇంకా పెరిగి అసాధ్యమైన స్థాయికి చేరుతుందని అంచనాలు ఉన్నాయి. అప్పటికి పెళ్లిళ్లలో బంగారం ఇవ్వడం అంటే సామాన్యులకు ఊహకందని విషయంగా మారవచ్చు.ఈ నేపథ్యంలోనే పెళ్లి వేడుకల్లో ‘న్యూ బిగినింగ్’ అనే భావనను ముందుకు తీసుకురావాలనే చర్చ జరుగుతోంది. బంగారు నగల స్థానంలో వన్ గ్రాము గోల్డ్, లేదా కేవలం ప్రతీకాత్మకంగా చిన్న గుర్తుగా మాత్రమే బంగారాన్ని ఉపయోగించడం వంటి ఆలోచనలు వినిపిస్తున్నాయి. మరికొందరు అయితే బంగారం బదులు డబ్బును ఇవ్వడం ద్వారా కొత్త జీవితానికి ఆర్థిక భద్రత కల్పించవచ్చని సూచిస్తున్నారు.

ప్రస్తుతం ఇవన్నీ కొందరికి సరదాగా అనిపించవచ్చు. కానీ బంగారం ధరలు ఇదే విధంగా పెరుగుతూనే ఉంటే, భవిష్యత్తులో ఇవే నిజమైన పరిష్కారాలుగా మారే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మధ్యతరగతి వారే కాదు, ధనవంతులు కూడా ఆలోచించాల్సిన పరిస్థితి వస్తోంది. చివరికి పెళ్లి అనేది బంగారం ప్రదర్శన కాదు, ప్రేమ, నమ్మకం, బాధ్యతలతో కూడిన బంధం అనే విషయాన్ని మనం మళ్లీ గుర్తు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: