కరోనా వల్ల విద్యా వ్యవస్థలో చాలా మార్పులు వచ్చాయి, వస్తున్నాయి. ఇప్పటికే తరగతి గదులు ఇంటర్నెట్ లో బందీ అయ్యాయి. ఇప్పుడు పరీక్ష విధానం, పేపర్ల సంఖ్యలో కూడా మార్పులు వచ్చేస్తున్నాయి. ఈ ఏడాది పదో తరగతి పరీక్షలను యధావిధిగా 11 పేపర్లతో నిర్వహించాలా లేక ఆరింటితో సరిపెట్టాలా అని ప్రభుత్వం ఆలోచిస్తోంది. వారం రోజుల్లో దీనిపై క్లారిటీ ఇస్తామమంటున్నారు విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్.

గతంలో పదో తరగతి పరీక్షల్లో 11 పేపర్లు ఉండేవి, తెలుగు, ఇంగ్లిష్, మ్యాథ్స్, సైన్స్, సోషల్.. ఈ ఐదు సబ్జెక్ట్ లకు పార్ట్-1, పార్ట్-2 అంటూ రెండు పేపర్లు ఇచ్చేవారు. హిందీకి మాత్రం ఒకటే పేపర్ ఉండేది. ఇలా పార్ట్-1, పార్ట్-2 పేరుతో 50, 50 మార్కులకు ఇచ్చే ప్రశ్నా పత్రాలపై ఉపాధ్యాయులకు, అటు విద్యార్థులకు పూర్తి అవగాహన ఉంది. కరోనా నేపథ్యంలో వీటిని 6కి కుదిస్తే విద్యార్థులు అనవసర ఆందోళనకు గురవుతారనే వాదనా ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంతో చూడాలి.

సామాజిక దూరంతోపాటు, ఇతర కొవిడ్ నిబంధనలు పాటిస్తూ హైస్కూల్ విద్యార్థులకు క్లాసులు చెబుతున్నారు. పరీక్ష హాల్ లో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని ఊహించలేం. పరీక్షలకోసం ప్రయాణాలు, పరీక్ష కేంద్రాల వద్ద రద్దీ, పేపర్ల మార్పిడితో వైరస్ సోకే ముప్పు ఎక్కువగా ఉంటుందనే అనుమానంతో గతంలో పరీక్షలనే రద్దు చేశారు. ఇప్పుడు కూడా పరీక్షల సంఖ్యను కుదించడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే సరిగ్గా పరీక్షల ముందు ఇలాంటి నిర్ణయాలు ప్రకటించకుండా.. కాస్త ముందుగానే సమాచారం ఇవ్వాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. విద్యార్థుల ప్రిపరేషన్ కు అవసరమైన టైమ్ ఉంటేనే కొత్త విధానానికి అలవాటు పడతారని, 100 మార్కులకు ఒకే పేపర్ విధానానికి సంబంధించి మోడల్ టెస్ట్ లు నిర్వహించాల్సి ఉంటుందని చెబుతున్నారు. విద్యార్థులను ముందస్తుగా సమాయత్తం చేస్తే వారిలో ఆందోళన తగ్గించవచ్చని నిపుణులు చెబుతున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: